FbTelugu

గ్రేటర్ విజయం డీజీపీ, ఎన్నికల సంఘానికి అంకితం

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ లో బీజేపీ అభ్యర్థుల గెలుపును డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి, రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) కమిషనర్ సి.పార్థసారధికి అంకితం చేస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు.

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గ్రేటర్ హైదరాబాద్ లో టీఆర్ఎస్ విజయం కోసం కార్యకర్తల కంటే ఎక్కువగా పార్థసారథి, మహేందర్ రెడ్డిలు గులాబి రంగు చొక్కాలు వేసుకుని కష్టపడ్డారని ఎద్దేవా చేశారు. సారు,  కారు, ఇక రారు.. 2023లో కారు షెడ్డుకు పోవటం ఖాయమన్నారు. బ్యాలెట్ పేపర్లపై పెన్నుతో గీసినా, గీకినా ఓటుగా పరిగణనలోకి తీసుకోవాలని ఎన్నికల సంఘం అర్థరాత్రి తప్పుడు సర్క్యులర్ ను విడుదల చేయటం దారుణమన్నారు. ఈ ఆదేశాలను హైకోర్టు కొట్టివేసి చెంపపెట్టు పెట్టిందని సంజయ్ అన్నారు.

టీఆర్ఎస్ పార్టీకి సన్ స్ట్రోక్ తగిలిందని ఆయన విమర్శించారు. మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ప్రజలకు ఇప్పటికైనా సీఎం కేసీఆర్ అపాయింట్ మెంట్ ఇవ్వాలని సూచించారు. తెలంగాణలో గడీల పాలనను బద్దలు కొట్టే దమ్ము బీజేపీ సొంతం అన్నారు. త్వరలోనే గడీ నుంచి సీఎం కేసీఆర్ ను బయటకు తీసుకొస్తామన్నారు. గెలిచాం కదా అని అహంకారాన్ని నెత్తికి ఎక్కించుకోం.. హైదరాబాద్ ప్రజల సమస్యలపై పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

ఆదరించిన హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు ఇప్పిస్తామని ఆయన అన్నారు. సీట్లు మాత్రమే కాదు.. బీజేపీ ఓట్ల శాతం భారీగా పెరిగాయన్నారు. జాతీయ నాయకుల ప్రచారం బీజేపీకి కలిసొచ్చిందని బండి సంజయ్ తెలిపారు.

కేటీఆర్ కు గ్రేటర్ ఓటర్లు బుద్ది చెప్పారు….

కేటీఆర్ తప్పుడు ఆరోపణలకు ప్రజలే సమాధానం చెప్పారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలు ఇచ్చిన సవాల్ ను స్వీకరించాలన్నారు. తెలంగాణ ప్రజలకు బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయమని, 2023లో అధికారానికి రావటానికి గ్రేటర్ ఎన్నికలు ఫ్లాట్ ఫామ్ గా ఉపయోగించుకుంటామన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని, బీజేపీపై టీఆర్ఎస్ చేసిన తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మలేదన్నారు. ఆంధ్ర, రాయలసీమ ప్రాంతీయులను సోషల్ మీడియా ద్వారా టీఆర్ఎస్ భయభ్రాంతులకు గురిచేసిందని కిషన్ రెడ్డి వివరించారు.

bjp state office

You might also like

Leave A Reply

Your email address will not be published.