భాగ్యనగరమైన హైదరాబాద్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తెలంగాణలో కరోనా తగ్గుతుందనుకుంటున్న సమయంలో జీహెచ్ఎంసీ పరిధిలో శనివారం ఒక్కరోజే 30 పాజిటివ్ కేసులు నమోదు కావడం హైదరాబాద్ వాసులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది.
అందులో ఒకే కుటుంబంలో ఏడుగురికి సోకడంతో ఆ ప్రాంతవాసుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. జీహెచ్ఎంసీ పరిధిలో ఒక్కరోజే ఇన్ని కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం కూడా తీవ్ర ఆందోళనకు గురైంది. హైదరాబాద్‌లో కరోనా కట్టడికి అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నా ఇన్ని కేసులు ఎలా వచ్చాయో తెలియక వారు తలలు పట్టుకున్నారు. ఈ కేసులు పెరగడానికి కారణం ఏమిటా అన్న కోణంలో తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
కారణం ఇదేనా..?
హైదరాబాద్ నగరంలో ముందునుంచీ కరోనా ప్రభావం ఎక్కువగానే ఉంది. ఒకదశలో తగ్గుతుందన్న సంతోషంలో ఉండగానే మరో ప్రమాదం తబ్లిగీ రూపంలో వచ్చిపడింది. దీంతో పెద్ద ఎత్తున పాజిటివ్ కేసులు పెరిగిపోయాయి. ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారందరినీ క్వారంటైన్లకు తరలించినా పాజిటివ్‌ల తీవ్రత తగ్గడం లేదు. మధ్యలో కొంత తగ్గుతుందని భావించిన ప్రభుత్వం నగరంలో ఏర్పాటు చేసిన కంటైన్మెంట్ కేంద్రాలను కూడా తీసివేసింది. లాక్డౌన్ విధించినా అది పూర్తిస్థాయిలో అమలు కాకపోవడం వల్లనే ఈ కేసుల సంఖ్య ఇంకా పెరుగుతుందన్న వాదన హైదరాబాద్ వాసుల్లో నెలకొంది. పోలీసులు ఎంత కట్టడి చేసినా మామూలు రోజుల్లానే జనం బయట తిరుగుతున్నారని.. ఇటీవల మద్యం దుకాణాలు తెరవడంతో ఒక్కసారిగా జనం రోడ్లమీదకు వచ్చారని, ఇప్పుడు హైదరాబాద్‌లో పరిస్థితి మరీ దారుణంగా తయారైందంటున్నారు.
రోడ్లన్నీ వాహనాలు, జనాలతో కిక్కిరిసి పోతున్నాయని.. ఎక్కడా భౌతికదూరం పాటించడం లేదన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. కొన్ని కార్యాలయాలు కూడా తెరుచుకోవడంతో ఎక్కువమంది జనం రోడ్లమీదకు వస్తున్నారని.. ఈ కారణాల రీత్యా కరోనా వ్యాప్తి మరింత తీవ్రంగా మారుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ నుంచి ఎవరినీ బయటకు వెళ్లనీయమని.. బయటవారినీ లోపలకు రానీయమని సీఎం కేసీఆర్ చెప్పినా అది ఎక్కడా కనిపించడం లేదు. దర్జాగా హైదరాబాద్ నుంచి రాకపోకలు జరుగుతున్నాయన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి లాక్‌డౌన్‌ను మరింత కట్టుదిట్టం చేసి కరోనా వ్యాప్తిని అరికట్టేలా మరిన్ని చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.