FbTelugu

ఠారెత్తిస్తున్న హైదరాబాద్ చావులు

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ చావు లెక్కలు చూస్తే ఎవరైనా ఆందోళనకు గురవుతారు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఇప్పటికీ ప్రభుత్వం కరోనా పాజిటివ్ కేసులు, చావుల విషయంలో స్పష్టంగా లెక్కలు ప్రకటించడం లేదనేది ఈ లెక్కలను బట్టి స్పష్టమవుతుంది.
ఏడాది కాలంగా రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తున్నది. వాస్తవ కేసులకు, ప్రభుత్వం ప్రకటించే కేసులకు ఏమాత్రం పొంతన ఉండడం లేదు. ఉదాహారణకు గ్రేటర్ హైదరాబాద్ లో చావు లెక్కలు తీసుకుందాం. కరోనాకు ముందు సాధారణ రోజుల్లో ప్రతి నిత్యం 160 వరకు మరణాలు నమోదు అవుతుండేవి. అప్పుడప్పుడు 200 వరకు చేరుకునేవి. కాని ఈ ఏడాది ఏప్రిల్, మే నెలలో మరణాలు ఊహించని విధంగా పెరిగాయి. ప్రతిరోజు 400 వరకు నమోదు కాగా కొన్ని రోజుల్లో 450 వరకు కూడా మరణాలు రిజిష్టర్ అయ్యాయి. ఇలా నమోదు అయిన మరణాల్లో 95 శాతం హాస్పిటల్ నుంచి వచ్చినవే కావడం గమనార్హం.

ఇళ్లలో చనిపోయిన వారి లెక్కలను కలిపితే రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. ఇళ్లలో, అన్ని హాస్పిటళ్లలో మరణాల లెక్కలు తీస్తే ఆ సంఖ్య ఎంత ఉంటుందో మీరే ఒకసారి ఊహించుకోండి.
ఈ మధ్య ఖమ్మం జిల్లాలో న్యూ డెమోక్రసీ నాయకుడు ఒక ప్రకటన చేశారు. ఒక రోజు ఖమ్మం జిల్లాలో 19 మంది కరోనాతో చనిపోగా, అదే రోజు తెలంగాణ మొత్తం 21 మంది చనిపోయినట్లు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఈ లెక్కలపై ఆ పార్టీకి చెందిన రంగారావు తీవ్ర అభ్యంతరం చెప్పారు. ప్రభుత్వం చావు లెక్కలు కూడా దాస్తున్నదని ఆయన ఆరోపించారు. ఒక్క ఖమ్మం జిల్లాలో 19 మంది చనిపోతే, మిగతా 9 జిల్లాల్లో ఇద్దరే చనిపోయారా అని ఆయన ప్రశ్నించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.