హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ లో మూడు రోజుల విరామానంతరం మళ్లీ ఉచిత కరోనా పరీక్షలు ప్రారంభమయ్యాయి.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 50వేల ఉచిత పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించిన ప్రభుత్వం మూడు రోజుల క్రితం వరకు 30వేల వరకు నమూనాలు సేకరించింది. దీంతో హైదరాబాద్ నగరంలో కేసుల సంఖ్య రెట్టింపు అయ్యింది. మూడు నుంచి నాలుగు వేల నమూనాలు సేకరిస్తే వెయ్యికి తక్కువ కాకుండా పాజిటివ్ కేసులు వచ్చాయి.
ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందనే ఉద్దేశంతో సేకరించిన నమూనాలు పరీక్షించలేదనే సాకు చూపి మూడు రోజుల క్రితం నిలిపివేశారు. సోషల్ మీడియాలో ప్రజల నుంచి విమర్శలు పెరగడంతో మళ్లీ మంగళవారం నుంచి నమూనాలు సేకరించడం మొదలు పెట్టారు. సరోజినీదేవి కంటి ఆసుపత్రి, నేచర్ క్యూర్, ఆయుర్వేదిక్ హాస్పిటల్, చార్మినార్ నిజామియా హాస్పిటల్లో ఇవాళ్టి నుంచి నమూనాలు సేకరిస్తున్నారు.
ఒక్కో కేంద్రంలో రోజుకు 250 నమూనాలు సేకరించాలని లక్ష్యంగా నిర్థేశించారు. రంగారెడ్డి జిల్లాలోని కొండాపూర్ ఏరియా ఆసుపత్రి, వనస్థలిపురం ఏరియా ఆసుపత్రి, బాలాపూర్ యూపీహెచ్సీ, మహేశ్వరం సీహెచ్సీలలో రోజుకు 150 శాంపిల్స్ చొప్పున సేకరించనున్నారు.