FbTelugu

ఎమ్మెల్సీ ఎన్నికలు… తోకముడిచిన టీఆర్ఎస్?

హైదరాబాద్: హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎన్నికల బరి నుంచి టీఆర్ఎస్ పార్టీ తప్పుకుంటున్నదా అంటే అవుననే విధంగా పరిణామాలు కన్పిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేసి పరాజయం మూటగట్టుకునే బదులు పోటీ చేయకుండా మరొకరికి మద్దతు ఇవ్వడమే ఉత్తమమనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

ఈ మధ్యకాలంలో వరుస పరాభావాలతో టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పోటీ చేయకుండా ఉండడమే ఉత్తమమే నిర్ణయంతో ఉన్నట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇప్పటికే ఖమ్మం-వరంగల్-నల్లగొండ జిల్లా గ్రాడ్యుయేట్ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ రెడ్డి పేరును ప్రకటించి బీ ఫారమ్ కూడా అందచేసింది. ఆయన ప్రచారంలో దూసుకుపోతున్నారు. హైదరాబాద్ విషయానికి వచ్చేసరికి నాన్చుడు వైఖరి అవలంభిస్తూ ఏటూ తేల్చడం లేదని కార్యకర్తలు గుర్రుగా ఉన్నారు. దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో సీట్లు రాకపోవడం కారణంగా చెబుతున్నారు.

మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తో పాటు మరికొందరు పేర్లు ప్రస్తావనకు వచ్చినప్పటికీ పార్టీ అధినేత కిమ్మనడం లేదని శ్రేణులు అనుకుంటున్నారు. ఖర్చు చేసి పోటీచేసేందుకు ఇద్దరు ముగ్గురు ముందుకు వచ్చినా వారి బయోడేటా వైపు కన్నెత్తి చూడ్డం లేదని సమాచారం. హైదరాబాద్ నుంచి మళ్లీ బీజేపీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ రామచందర్ రావు బరిలో ఉన్నారు. కమ్యూనిస్టు పార్టీల నుంచి మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్ పోటీ చేస్తున్నారు. టీఆర్ఎస్ నుంచి ఇంకా ఎవరినీ ఖరారు చేయలేదు.

పోటీ చేసి ఓటమి పాలయ్యే బదులు కమ్యూనిస్టులు బలపర్చిన అభ్యర్థి నాగేశ్వర్ కు మద్ధతు పలకాలని టీఆర్ఎస్ నాయకత్వం నిర్ణయించిందని కార్యకర్తలు గుసగుసలాడుతున్నారు. నాగేశ్వర్ ఈ మధ్య నిజామాబాద్ జిల్లా పసుపు రైతులకు మద్ధతుగా ఆందోళన చేసి వచ్చారు. నిజామాబాద్ నుంచి బీజేపీ ఎంపీ అరవింద్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనను బదనాం చేసేందుకే నాగేశ్వర్ ను అక్కడికి టీఆర్ఎస్ నేతలు పంపించారనే వాదన అప్పట్లో విన్పించింది. లోపాయకారికి నాగేశ్వర్ కు మద్ధతు పలికి బీజేపీ అభ్యర్థిని ఓడించాలనే యోచనలో ఉన్నట్లు తెలిసిందే. ఫలితంగా ఒకే దెబ్బకు రెండు పిట్టలు అనే విధంగా టీఆర్ఎస్ ప్రణాళిక వేసిందంటున్నారు.

కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు జి.చిన్నారెడ్డి బరిలో ఉన్నారు. ఆయన సమర్థుడైన నాయకుడే అయినప్పటికీ గ్రాడ్యుయేట్లు, యువతలో అంతగా ఫాలోయింగ్ లేదంటున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.