FbTelugu

ఆర్టీసీపై గవర్నర్ సీరియస్ గా ఉన్నారు…

Governor-is-serious-on-RTC--

హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెలపై అఖిలపక్ష నాయకులు రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తో భేటీ అయ్యారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె, న్యాయమైన డిమాండ్లు, హైకోర్టు అక్షింతలు, సీఎం కేసీఆర్ వైఖరిపై అఖిలపక్ష నాయకులు వివరించారు. గవర్నర్ తో భేటీ తరువాత రాజ్ భవన్ బయట మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీ కార్మికుల మరణాలపై గవర్నర్ తీవ్రంగా స్పందించారని కాంగ్రెస్ నాయకులు వి.హన్మంతరావు తెలిపారు. బయట జరిగే ప్రతి అంశాన్ని గవర్నర్ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కార్మికుల ఆత్మహత్యల పై గవర్నర్ విచారం వ్యక్తం చేశారు. ఆర్టీసీ సమ్మె పై గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో మనుషులు అన్యాయంగా మరణిస్తున్నందున కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరాం. కార్మికుల ఆత్మహత్యలు, కోర్టు సూచనలు గవర్నర్ దృష్టికి తీసుకెళ్ళామని కాంగ్రెస్ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. కార్మికుల కు న్యాయం విధంగా చూస్తామని గవర్నర్ తెలిపారు.

గవర్నర్ కి అన్ని విషయాలను క్లుప్తంగా చెప్పామని తెలంగాణ జన సమితి అధ్యక్షులు ఎం.కోదండరామ్ తెలిపారు. ప్రభుత్వం బాధ్యతను కోర్టు గుర్తు చేసినా స్పందన లేకపోవడం బాధాకరం. ఆర్టీసీలో ఎలాంటి మార్పులు చేయాలన్నా కేంద్రం అనుమతులు అవసరం. గవర్నర్ ఆర్టీసీ సమ్మె పై సీరియస్ గా ఉన్నట్లు మాకు అర్థం అయింది.

ప్రభుత్వ మొండి వైఖరి పై సూచన చేయాలని గవర్నర్ ను కోరడం జరిగిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. తెలంగాణ ఆర్టీసీలో కేంద్ర ప్రభుత్వనికి 30శాతం వాటా ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వనికి సంబంధం లేకుండా ముఖ్యమంత్రి ప్రైవేటీకరణ ఎలా చేస్తారని అన్నారు. కేంద్రం ఆమోదంతో ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారా?. ఆర్టీసీలో ఎలాంటి నిర్ణయాలు తోసుకోవలన్నా బోర్డ్ ఆమోదం ఉండాలి. కానీ ప్రస్తుతం బోర్డ్ లేకుండా కేసీఆర్ ఎలా ప్రకటనలు చేస్తున్నారు. కార్మికులు మరణించడం తీవ్రమైన పరిస్థితి అన్నారు. పక్క రాష్ట్రంలో సమ్మెకు వెళ్తే వెంటనే ప్రభుత్వం పరిష్కరించిందని, కమిటీ వేసిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం మాత్రం కర్కశంగా వ్యవహరిస్తోందన్నారు.

సెక్షన్ 39 ప్రకారం ఆర్టీసీ పై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న కేంద్రం అనుమతి అవసరమని టీడీపీ నాయకులు రావుల చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఆర్టీసీ ఆస్తులను అధికార పార్టీ నేతలు తీసుకొని వ్యాపారాలు చేస్తున్నారు. ఆర్టీసీ ప్రైవేట్ పరం అనే విషయానికి అప్పులే కారణం అయితే.. రాష్ట్ర ప్రభుత్వానికి లక్షల కోట్లు అప్పు ఉంది మరి ప్రభుత్వాన్ని ప్రైవేట్ పరం చేస్తారా? అని అడిగారు. బీజేపీ నుంచి మోహన్ రెడ్డి, న్యూ డెమోక్రసీ నుంచి పోటు రంగారావు, ఇంటి పార్టీ నుంచి చెరకు సుధాకర్, విమలక్క గవర్నర్ ను కలిసినవారిలో ఉన్నారు.

You might also like