FbTelugu

నెలాఖరుకు లక్ష దాటడం ఖాయం: ప్రభుత్వం అంచనా

హైదరాబాద్: తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. శుక్రవారం నాడు ఒక్కసారిగా కేసుల సంఖ్య రెట్టింపు అయ్యింది.
అంతకు ముందు రోజు వరకు వేయి వరకు నమోదు కాగా శుక్రవారం నాడు 1892 కేసులు నమోదు అయ్యాయి. ఇలాగే కేసుల ఉధృతి పెరిగితే జూలై నెలాఖరు వరకు 60వేలు దాటవచ్చని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ అంచనాకు వచ్చింది. ఒక లక్షకు చేరుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు. నిన్న మొన్నటి వరకు ప్రతిరోజు 3 వేల నుంచి 3500 వరకు నమూనాలు సేకరించారు.

శుక్రవారం నాడు ఆరు వేల వరకు నమూనాలు సేకరించడంతో కేసుల సంఖ్య అమాంతం పెరిగింది. 1892 కేసులు రాగా, గ్రేటర్ లో 1658 నమోదు అయ్యాయి. సేకరిస్తున్న నమూనాల్లో సగటున 22-25 శాతం పాజిటివ్ కేసులు వస్తున్నాయి. ఒక్క గ్రేటర్ హైదరాబాద్ లోనే వేయికి తక్కువ కాకుండా కేసులు వస్తుడడం గమనార్హం. ఒకటి రెండు రోజుల్లో రోజుకు 12వేల టెస్టులు చేసే సామర్థ్యం పెరగనున్నది. ప్రభుత్వంలో 6వేల వరకు, ప్రైవేటు లో 8వేల వరకు టెస్టులు చేసే పరికరాలు ఉన్నాయని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ రెండు మూడు రోజుల క్రితం తెలిపారు.

ఈ లెక్కన రోజుకు 12 వేల వరకు టెస్టులు చేస్తే ఐదువేల పాజిటివ్ కేసులు నమోదు అయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఇందులో నాలుగు వేల వరకు గ్రేటర్ పరిధిలోనే ఉంటాయని అధికారులు అంచనాకు వస్తున్నారు. ఇలా వస్తే నెలాఖరు ఒక లక్ష కు చేరుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉండదు. హైకోర్టు కూడా సీరియస్ గా ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం టెస్టుల సంఖ్యను పెంచనున్నట్లు తెలిసింది.
ఒక్క నెలలోనే 8 రెట్లు కేసులు పెరగడం ఆందోళన కలిగించే అంశంగా పరిగణించాలి. మే నెలలో 1659 కేసులు నమోదు కాగా, జూన్ నెలలో 13641 కేసులు నమోదు అయ్యాయి. ఒక నెల వ్యవధిలో 8 రెట్లు పెరిగాయనేది లెక్కలు చెబుతున్నాయి.

You might also like