FbTelugu

కరోనా కాలంలోనూ సర్కారు దోపిడీ !

కరోనా కాలంలోనూ పాలకులు ప్రజలను దోచుకోవడం ఆపడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో దేశంలో పెట్రోలియం ధరలు ప్రభుత్వం చేతుల్లో ఉండేవి. రానురాను వాటిని చమురు సంస్థల చేతుల్లోకి పంపేశారు. చమురు వినియోగాన్ని బట్టి ఆ సంస్థలు వాటి రేట్లను పెంచుకునే అవకాశాన్ని కల్పించారు. దీనిపై అప్పట్లో బాగానే విమర్శలు వచ్చాయి.

దీంతో ప్రభుత్వాలు, చమురు సంస్థలు ఒక వివరణ ఇచ్చాయి. చమురు వినియోగానికి డిమాండ్‌ తక్కువగా ఉంటే ధరలు తగ్గుతాయని.. ఎక్కువగా ఉంటే పెరుగుతాయని.. ధరల పరిస్థితి వాటి డిమాండ్‌పైనే ఆధార పడి ఉంటుందని తెలిపాయి. కానీ, ఇప్పుడు చమురు ధరలు భారీగా పడిపోయినా ధరలు మాత్రం తగ్గడం లేదు ఎందుకని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

చమురు ధరలు తగ్గిన దానికంటే రెట్టింపుగా ప్రభుత్వాలు పన్నుల రూపంలో వినియోగదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాయని, అందుకే చమురు ధరలు తగ్గినా ఇండియాలో పెట్రోలియం ధరలు తగ్గడం లేదన్న విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. కరోనా కాలంలోనూ ప్రభుత్వాలు కనికరం చూపకపోగా.. పెట్రోలియం ధరలను పన్నుల ద్వారా పెంచి కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నాయని వినియోగదారులు ఆగ్రహంతో ఉన్నారు.

దేశ వ్యాప్తంగా అమలు చేస్తోన్న లాక్‌డౌన్‌ వల్ల ఇంధన వినియోగం భారీగా పడిపోయింది. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా నిలిచిపోవడంతో గడిచిన ఏప్రిల్‌లో పెట్రోల్, డీజిల్‌ వాడకం భారీగా తగ్గిపోయింది. క్రితం ఏప్రిల్‌ నెలలో కేవలం 9.93 మిలియన్‌ టన్నుల ఇంధన డిమాండ్‌ మాత్రమే చోటు చేసుకున్నట్లు ప్రభుత్వ గణంకాలు తెలిపాయి. గతేడాది ఏప్రిల్‌ వాడకంతో పోల్చితే 45.8 శాతం తక్కువగా నమోదైనట్టు వెల్లడించాయి. ఇది 2007 నాటి తర్వాత ఇదే అత్యల్ప వినియోగమని పేర్కొన్నాయి.

శుద్ధి చేసిన ఇంధనాన్ని దేశీయ ఇంధన రిటైల్‌ సంస్థలు గత సంవత్సరంతో పోలిస్తే ఏప్రిల్‌ తొలి రెండు వారాల్లో 50శాతం తక్కువ మొత్తాన్ని విక్రయించినట్టు పేర్కొన్నాయి. ఏప్రిల్‌ తొలి రెండు వారాల్లో ప్రభుత్వ రంగంలోని రిటైల్‌ కంపెనీల విక్రయాల్లో 50 శాతం తగ్గుదల చోటు చేసుకుంది. ఇంటర్నేషనల్‌ ఎనర్జీ ఏజెన్సీ(ఐఇఎ) రిపోర్టు ప్రకారం.. మార్చిలో అంచనా వేసిన 2.4శాతం వృద్ధితో పోలిస్తే 2020లో వార్షిక ఇంధన వినియోగం 5.6శాతం పడిపోనుందని అంచనా.

లాక్‌డౌన్‌తో దేశంలో పారిశ్రామిక రంగం పూర్తిగా నిలిచిపోవడంతో డీజిల్‌ వినియోగం భారీగా తగ్గిపోయింది. రవాణ రంగం కూడా దాదాపుగా స్తబ్దుగానే ఉండటంతో పెట్రోల్, డీజిల్‌ వాడకం పడిపోయింది. ఏడాదికేడాదితో పోల్చితే క్రితం ఏప్రిల్‌లో దేశంలో రవాణా, నీటిపారుదల అవసరాలకు ఉపయోగించే డీజిల్‌ వినియోగం ఏప్రిల్‌లో 55.6శాతం పడిపోయినట్లు ఐఇఎ గణంకాలు పేర్కొం టున్నాయి. ఇక పెట్రోల్‌ వినియోగం 60.6 శాతం తగ్గింది. పెట్రోలియం వినియోగం ఇంత తక్కువకు పడిపోయినా ఇండియాలో మాత్రం వాటి ధరలను తగ్గించకపోవడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

మిగతా దేశాల్లో వీటి ధరలు తగ్గించినా ఇండియాలో ఎందుకు తగ్గించడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఇండియాలో వీటి ధరలు తగ్గిస్తే నిత్యావసర వస్తువుల ధరలు కూడా కొంతమేర తగ్గి కరోనా కాలంలో పేదలకు ఎంతో ఆసరాగా ఉండేదని.. కానీ, ప్రభుత్వాలు ప్రజల కష్టాల కంటే వారికి ఆదాయమే ముఖ్యమైనదని భావిస్తున్నట్టు వ్యాఖ్యానిస్తున్నారు. ఇండియాలో పెట్రోల్, డీజిల్‌ పన్నులు మళ్లీ మళ్లీ పెంచడం ద్వారానే కేంద్ర ప్రభుత్వం మూడున్నర లక్షల కోట్ల రూపాయలను వెనకేసుకుందని విమర్శలు వినిపిస్తున్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.