తాడేపల్లి: జనసేన అధినేత కొణిదెల పవన్ కల్యాణ్ కు సొంత అభిప్రాయం అంటూ ఏమీ లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. పవన్ రాత్రి ఒక పార్టీతో.. పగలు మరో పార్టీతో తిరుగుతున్నారని ఆరోపించారు.
ఆయన కు ఆవేశం తప్ప.. ఆలోచన లేదని సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో అన్నారు. చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి పోయారని, ఆర్థిక పరిస్థితి సరిగా లేకున్నా.. హామీలన్నీ నెరవేరుస్తున్నామన్నారు. సిఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలనకు నిదర్శనమే స్థానిక సంస్థల ఫలితాలు అన్నారు. స్థానిక ఎన్నికల్లో జగన్ పై తప్పుడు కేసులు పెట్టినవారికి జనం తగిన బుద్ధి చెప్పారు. ఒక్క నాయకుడు జగన్ ను ఎదుర్కొనేందుకు టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య లోపాయికారి ఒప్పందం ఉందన్నారు. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం ఉపఎన్నికలో కూడా భారీ మెజార్టీతో గెలుస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.