FbTelugu

విద్యార్థుల‌కు శుభ‌వార్త‌

ఉన్న‌త చ‌దువులు చ‌దివే విద్యార్థులంద‌రికీ ఇది నిజంగా శుభ‌వార్తే. ప‌రీక్ష‌లంటే జుట్టు పీక్కుని.. ప‌గ‌లూ రాత్రీ తేడా లేకుండా చ‌దివేసి, చ‌ద‌వలేక‌ కాపీలు కొట్టేయాల్సిన అవ‌స‌రం ఉండ‌దు.

డిగ్రీ, ఇంజినీరింగ్ ఆ పై స్థాయి ప‌రీక్ష‌లలో భారీ మార్పుల‌కు యూనివ‌ర్సిటీలు సిద్ధ‌మ‌య్యాయి. ముఖ్యంగా తెలంగాణ‌లోనే డిగ్రీ కోర్సుల‌కు పెద్దన్న ఉన్న ఉస్మానియా విశ్వ‌విద్యాల‌యం, ఇంజినీరింగ్‌లో శాసిస్తున్న జె.ఎన్‌.టి.యూ భారీ మార్పులు తీసుకువ‌స్తున్నాయి. దీనివ‌ల్ల త్వ‌ర‌లో జ‌రిగే డిగ్రీ, ఇంజినీరింగ్ ప‌రీక్ష‌ల విష‌యంలో ఎలాంటి బెంగ లేకుండా ఆడుతూ, పాడుతూ ప‌రీక్ష‌లు రాసేయొచ్చ‌ని లెక్చ‌రర్లు చెబుతున్నారు.

వ‌చ్చే అక‌డ‌మిక్ సంవ‌త్స‌రం ఎలా ఉండాలి? ఎప్పుడు మొద‌ల‌వ్వాలి? ప‌రీక్ష‌లు ఎలా ఉండాలి? అనే విషయాల‌పై నివేదిక ఇచ్చేందుకు యూనివ‌ర్సిటీ గ్రాంట్స్ క‌మిష‌న్ రెండు క‌మిటీలు వేసి సూచ‌న‌లు కోరింది. ఆ రెండు క‌మిటీలు ఈ మ‌ధ్య‌నే నివేదిక‌లు సైతం ఇచ్చాయి. ఇందులో ప‌రీక్ష‌ల విష‌యంలో రెండు గంట‌లే ఉండాల‌ని సూచించాయి. అది కూడా చాయిస్ ఎక్కువ‌గా ఉండాల‌ని చెప్పాయి. ఇక వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రం సెప్టెంబ‌రు నుంచి మొద‌లుపెట్టాల‌ని, కానీ ఇప్ప‌టికే చ‌దువుతున్న విద్యార్థుల‌కు మాత్రం ఆగ‌స్టు నుంచి విద్యా సంవ‌త్స‌రం మొద‌లుపెట్టాల‌ని సూచించాయి. వ‌చ్చే ఏడాది సిల‌బ‌స్ కూడా ఆన్‌లైన్‌లో మొద‌లు పెట్టాల‌ని చెప్పాయి.
ఈ సూచ‌న‌ల‌కు అనుగుణంగా తెలంగాణ యూనివ‌ర్సిటీలు నిర్ణ‌యం తీసుకున్నాయి. అవును మ‌రి.. ఎందుకంటే ఈసారి జ‌ర‌గ‌బోయే ప‌రీక్ష‌లు రెండు గంట‌లే ఉంటాయి. ఇంజినీరింగ్‌, డిగ్రీ, పీజీ ప‌రీక్ష‌ల‌ను మూడు గంట‌ల‌కు బ‌దులుగా రెండు గంట‌లే ఉంటాయి. ప‌రీక్ష‌ల‌లో అన్ని ప్ర‌శ్న‌ల‌కు జ‌వాబులు లేకుండా చాయిస్ ఎక్కువ‌గా ఇచ్చి జ‌వాబులు రాయాల‌ని విశ్వ‌విద్యాల‌యాలు నిర్ణ‌యించాయి. దీనికి అనుగుణంగా తెలంగాణ‌లో జులైలో డిగ్రీ, ఇంజినీరింగ్ ప‌రీక్ష‌లు జ‌రిగే అవ‌కాశం ఉంది.

అంతేకాదు హాజ‌రు, మార్కుల‌తో సంబంధం లేకుండా వ‌చ్చే సెమిష్ట‌ర్‌కు విద్యార్థులంద‌ర్నీ పంపించ‌నున్నాయి. లాక్‌డౌన్ స‌మ‌యంలో త‌ర‌గ‌తులు కోల్పోయిన ప‌ని దినాల‌కు పూర్తి హాజ‌రు ఇస్తున్నందున విద్యార్థులు డిటైన్డ్ అయ్యే అవ‌కాశం ఉండ‌దు. ఇక గ‌త సెమిష్ట‌ర్‌లో బ్యాక్‌లాగ్ వ‌చ్చాయ‌ని, త‌ర్వాత సెమిష్ట‌ర్‌కు ప్ర‌మోట్ కాలేమ‌ని అనుకోన‌క్క‌ర్లేదు. ఎందుకంటే ఇవ‌న్నీ ఈసారికి ప‌ట్టించుకోరు. నేరుగా ప్ర‌మోట్ అవుతారు. అంటే మొద‌టి ఏడాది విద్యార్థులు రెండవ ఏడాదికి, రెండవ ఏడాది విద్యార్థులు మూడవ ఏడాదికి ప్ర‌మోట్ అవుతారన్న‌మాట‌. పి.హెచ్‌డి, ఎం.ఫిల్ చేసే అభ్య‌ర్థుల‌కు వెసులుబాట్లు క‌ల్పించాయి. అంటే వీరు త‌మ థీసిస్‌ను మ‌రో ఆరు నెల‌ల వ‌రకు స‌మ‌ర్పించేందుకు గ‌డువు ఇచ్చాయి.

You might also like