FbTelugu

కరోనా కాలంలో గుడ్‌న్యూస్‌

కరోనాతో దేశంలో ప్రతిరోజూ వందల మంది మృత్యువు బారిన పడుతున్నారు. కరోనా కట్టడికి ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా అది తగ్గడం లేదు. పైగా తన విజృంభణను మరింతగా పెంచుతూ ఉంది. అయితే, కరోనాతో ఆందోళనలో ఉన్నవారికి కరోనా కాలంలో నిజంగా అది గుడ్‌న్యూసే. ఇంతకీ ఆ గుడ్‌న్యూస్‌ ఏమిటా అని ఆలోచిస్తున్నారు కదా.. అదేనండి కరోనాను కట్టడి చేసేందుకు విధించిన లాక్‌డౌన్‌తో హైదరాబాద్‌తో పాటు ఐదు నగరాల్లో వాయు కాలుష్య తీవ్రత భారీగా తగ్గిందట. దీనివల్ల దాదాపు 630 అకాల మరణాలు తగ్గాయని ఒక అధ్యయనంలో తేలిందట. కాలుష్యం కారణంగా వ్యాధుల బారిన పడి ప్రజలు వైద్యానికి చేసే సుమారు రూ.5,173 కోట్లు ఖర్చు కూడా ఆదా అయిందని ఈ నివేదిక తెలిపింది.

సస్టెయినబుల్‌ సిటీస్‌ అండ్‌ సొసైటీ జర్నల్‌లో ఈ అధ్యయన వివరాలు ప్రచురితమయ్యాయి. కరోనా వైరస్‌ వ్యాప్తిని నియంత్రించేందుకు కేంద్రం ఈ ఏడాది మార్చి 25న దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించింది. అప్పటి నుంచి మే 11వరకు కాలంలో నమోదైన వాయు కాలుష్య గణాంకాలను గడిచిన ఐదేళ్లలో అదే వ్యవధిలో నమోదైన గణాంకాలతో పోల్చి చూశారు. హానికారక సూక్ష్మ ధూళి కణాలు ముంబైలో పదిశాతం తగ్గగా, ఢిల్లీలో 54శాతం వరకు తగ్గాయి. ఇక, హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా నగరాల్లో 24నుంచి 33శాతం దాకా తగ్గినట్టు శాస్త్రవేత్తలు తేల్చారు. బ్రిటన్‌లోని సర్రీ యూనివర్సిటీలో శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలు చేసినట్టు సమాచారం. కరోనా కాలం మరణాలను తగ్గించడం సంతోషకర విషయంగా ఈ ఐదు నగరాల ప్రజలు భావిస్తున్నారు.

You might also like