FbTelugu

చితికిన బంగారు బతుకులు

యావత్‌ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి ఎంతో మంది జీవితాలను అతలాకుతలం చేస్తోంది. అన్ని రంగాలను నిర్వీర్యం చేస్తోంది. కొవిడ్‌–19తో బంగారు ఆభరణాల తయారీ రంగానికి కోలుకోలేని దెబ్బతగిలింది.

ఈ వ్యాపారంపై ఆధారపడి బతుకులు వెల్లదీస్తున్న ఎంతోమంది జ్యూవలర్స్‌తోపాటు కిందిస్థాయి సిబ్బంది, ఆభరణాలు తయారు చేసేవారి జీవన విధానం కుదేలైంది. లాక్‌డౌన్‌ కారణంగా అన్నిరకాల లావాదేవీలు నిలిచిపోయాయి. శుభకార్యాలు ఆగిపోవడంతో ఈ ఏడాది బంగారం కొనుగోళ్లు జరగడం కష్టమేనంటున్నారు. తెలంగాణలో నగల షోరూంలు, ఆభరణాలు తయారు చేసే కార్ఖానాలు చాలా ఉన్నాయి. వేలాది మంది కార్మికులు ఇందులో పనిచేస్తున్నారు.

షోరూముల్లోనూ వేలాదిమంది పనిచేస్తున్నారు. వీరంతా ఇప్పుడు ఉపాధి కోల్పోయి దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. లాక్‌డౌన్‌తో బంగారం తయారీ వ్యాపారంపై ఆధారపడి జీవిస్తున్న వేలాది మంది ఉపాధి కోల్పోయారు. జ్యువెలరీ షోరూంల యజమానులు ఎలాగోలా వ్యాపారం నెట్టుకొస్తుండగా.. ఆభరణాల తయారీదారులు, మిషన్‌ కటింగ్, పాలిష్‌ చేసేవారు, స్టోన్‌ సెట్టర్స్‌ జ్యువలరీ డిజైనర్స్, మిషిన్‌మెన్‌లు, ఇలా ఎంతో మంది పనిలేక నానా ఇబ్బందులు పడుతున్నారు.

ఇళ్లు గడవక పడరాని పాట్లు పడుతున్నారు. జనం బంగారు ఆభరణాలు చేయించుకునే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో బంగారం వ్యాపారానికి కష్టకాలం వచ్చిపడిందని స్వర్ణకారులు చెబుతున్నారు. ఈ ఏడాది వివాహాది శుభకార్యాలు లేవు. దీంతో బంగారానికి డిమాండ్‌ ఉండదు. బంగారం వ్యాపారానికి 2021లోనే కొంతమేరకు అవకాశాలు ఉంటాయని పేర్కొంటున్నారు. దీంతో తమ పరిస్థితి ఏమిటని స్వర్ణకారులు ఆందోళన చెందుతున్నారు. కరోనాతో పెళ్లిళ్లు చాలావరకు వాయిదా పడ్డాయి. ఈ కారణంగా వస్తువుల తయారీకి ఆర్డర్‌ ఇచ్చేవారే కరువయ్యారు.

లాక్‌డౌన్‌ కారణంగా దాదాపు రెండు నెలలపాటు ఇళ్లకే పరిమితం కావడంతో.. చేతినిండా పనిలేదు. కడుపు నిండా తిండి లేదు. అసలే, బడా సంస్థలు బంగారు ఆభరణాల విక్రయ షోరూంలను తెరవడం, ప్రత్యేక ఆఫర్లు ఇస్తున్నట్లు జోరుగా ప్రచారాన్ని నిర్వహిస్తుండటంతో దాదాపు 80 శాతం మంది ఆభరణాలను రెడీమేడ్‌ షోరూంలలో కొనుగోలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో చిన్నచిన్న ఆభరణాలు, మరమ్మతులు చేస్తూ జీవనాన్ని వెళ్లదీసుకునే విశ్వబ్రాహ్మణులు లాక్‌డౌన్‌తో తీవ్రంగా నష్టపోయారు. అసలే పనులు అంతంత మాత్రం ఉండటం, షాపుల అద్దెలు, విద్యుత్‌ చార్జీలు చెల్లించాల్సి ఉండటంతో ఏమాత్రం ఆదాయ మార్గాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ప్రతి సంవత్సరం ఏప్రిల్‌ నుంచి మే, జూన్‌ మాసాల్లో పెద్దసంఖ్యలో వివాహాది శుభకార్యాలు జరగడంతో ఈ కాలంలోనే ఆభరణాల తయారీ ఆర్డర్లు పొంది కొద్దిగా ఆదాయాన్ని గడిస్తారు. రెండు నెలల నుంచి బంగారం దిగుమతులు పూర్తిగా నిలిచిపోవడం, హైదరాబాద్, సికింద్రాబాద్, జనరల్‌ బజార్లు మూసి ఉండటం, నాలుగు నెలల క్రితం తులం బంగారం ధర రూ.38 వేలు ఉండగా, ప్రస్తుతం రూ. 50 వేల దాకా చేరుకుంది. దీంతో మధ్యతరగతి వారు బంగారు ఆభరణాల తయారీకి పూర్తిగా దూరమయ్యారు. అటు సంపన్నులు భారీ పరిమాణంలో బంగారు ఆభణాలను బడా కంపెనీల వద్దనే కొనుగోలు చేస్తారు.

రియల్‌ ఎస్టేట్‌ ఆశాజనకంగా లేకపోవడం… షేర్‌ మార్కెట్‌లో తీవ్ర ఒడిదుడుకుల వల్ల మినిమమ్‌ గ్యారెంటీ ఉన్న బంగారాన్ని కిలోల చొప్పున కొనుగోలు చేసి ధనవంతులు ఇంట్లో నిల్వ చేయడం కూడా ధర విపరీతంగా పెరిగింది. ఇలా పలు కారణాల వల్ల ఆభరణాల తయారీపై ఆధారపడి జీవనాన్ని గడిపే వేలాది విశ్వబ్రాహ్మణ కుటుంబాల పరిస్థితి దారుణంగా మారింది.

You might also like