FbTelugu

ఆ ఒక్కడు..

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఒక పార్టీని మించి మరో పార్టీ ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. అధికార టీఆర్‌ఎస్‌ రాష్ట్ర మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వార్డుల వారీగా బాధ్యతలు అప్పగించింది. ఇక, బీజేపీ ఏకంగా కేంద్ర మంత్రులను రంగంలోకి దించింది. కాంగ్రెస్‌ పార్టీ మాత్రం స్థానిక నేతలతోనే పోరు సాగిస్తోంది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అక్కడక్కడా సభలకు, రోడ్‌షోలకే పరిమితమయ్యారు. మిగతా రాష్ట్ర నాయకులెవరూ ఈ ప్రచారంలో కనిపించడం లేదు. చేవెళ్ల మాజీ ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి ప్రారంభంలో జోరుగా పాల్గొన్నా కొన్ని రోజుల నుంచి ఆయన కూడా కొంత వెనుకడుగు వేసినట్టు కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఈ తరుణంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల బాధ్యతను తన భుజాలపై వేసుకొని నడిపిస్తున్న ఏకైక నాయకుడిగా పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి నిలుస్తున్నారని ఆ పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మొదటి నుంచి ప్రచారం ముగిసే శనివారం దాకా పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. బల్దియాలో కాంగ్రెస్‌ పార్టీకి గౌరవమైన స్థానం తీసుకొచ్చేలా పనిచేస్తున్నారని కాంగ్రెస్‌లోనే చర్చ సాగుతోంది. వాస్తవానికి జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరిగే ప్రాంతం కొంతమేర రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజిగిరి పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఉంది. కాబట్టి ఈ ప్రాంతం నుంచి ఎక్కువ స్థానాలు గెలుచుకునేలా ఆయన ప్లాన్‌ చేశారని, అక్కడ ఆయనే పూర్తిస్థాయి బాధ్యతలు తీసుకొని పనిచేస్తున్నారని ప్రచారం. ఆయన ప్రాంతం నుంచి కనీసం పది స్థానాలకు తగ్గకుండా సాధించేలా పావులు కదుపుతున్నారని కాంగ్రెస్‌ నేతలు అభిప్రాయపడుతున్నారు.

తన ప్రాంతంలో సుడిగాలిలా పర్యటిస్తూ అభ్యర్థులకు అండదండగా నిలవడమే కాకుండా, టీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎంలపై విరుచుకుపడుతూ వారి వైఫల్యాలను ఎండగట్టడంలో ముందుంటున్నారు. అంతేకాకుండా నగరంలోని మిగతా ప్రాంతాల్లో కూడా పర్యటిస్తూ కాంగ్రెస్‌ పార్టీ విజయానికి కృతనిశ్చయంతో పోరాడుతున్న నేత ఒక్క రేవంత్‌రెడ్డేనని కాంగ్రెస్‌ పార్టీతో పాటు మిగతా పార్టీల నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. అతని అకుంఠిత దీక్షతో చేస్తున్న పోరాటమే ఆయనను ఒక మహా నాయకుడిగా తీర్చిదిద్దిందని చెబుతున్నారు. పీసీసీ నేతలు, కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా జీహెచ్‌ఎంసీ ఎన్నికల గురించి మాకేందుకులే అని ఇళ్లలో కూర్చుంటే.. రేవంత్‌రెడ్డి మాత్రం ఒక్కడే బాధ్యతను భుజస్కంధాల మీద వేసుకొని పోరాడుతున్నాడని కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలే చెప్పుకుంటున్నారు. రోజురోజుకు బలహీనమవుతున్న కాంగ్రెస్‌ పార్టీని బతికించుకోవాలంటే ఇప్పుడు రేవంత్‌రెడ్డి నాయకులే పార్టీకి అవసరం అని కార్యకర్తలు చెబుతున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.