FbTelugu

గ్యాంగ్‌స్టర్ దూబే ఎన్ కౌంటర్..!

ఉత్తరప్రదేశ్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌దూబే ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. పోలీసులు ఆయనను గురువారం అరెస్టు చేసి ఉజ్జయిని నుంచి కాన్పూర్‌కు తీసుకు వెళుతుండగా తప్పించుకునేందుకు ప్రత్నించాడని, దీంతో అతడిని కాల్చి చంపినట్టు పోలీసులు తెలిపారు.

కరడుకట్టిన కాన్పూర్‌ గ్యాంగ్‌ స్టర్‌ వికాస్‌ దూబేను స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు శుక్రవారం ఉదయం కాల్చి చంపారు. దూబే పారిపోతుండగా పోలీసులు జరిపిన కాల్పుల్లో మరణించా డని సమాచారం. కరడుకట్టిన గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దూబేను ఉజ్జయిని నుంచి కాన్పూర్‌ నగరానికి తీసుకువస్తున్న కారు శుక్రవారం ఉదయం ప్రమాదవశాత్తూ బోల్తాపడింది.

భారీ వర్షం కురుస్తుండటంతోపాటు రోడ్డు సరిగా లేకపోవడం వల్ల కారు ప్రమాదానికి గురై బోల్తా పడిందని యూపీ స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు చెప్పారు. కారు ప్రమాదవశాత్తూ బోల్తా పడగానే గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దూబే పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు కాల్పులు జరిపారని ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. దూబే ప్రయాణిస్తున్న కారు బోల్తా పడిన ప్రదేశంలో కాల్పుల శబ్ధం వినిపించిందని ప్రత్యక్ష సాక్షి ఒకరు వెల్లడించారు.
ఆస్తులపై ఆరా!
కరడుకట్టిన కాన్పూర్‌ గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దూబే ఆస్తులపై ఆదాయపు పన్నుశాఖ దృష్టి సారించింది. 8 మంది పోలీసులను అత్యంత పాశవికంగా హతమార్చి పారిపోయి గురువారం పోలీసులకు చిక్కిన వికాస్‌ దూబే తక్కువ కాలంలో కోట్లాది రూపాయల ఆస్తులు సంపాదించాడని ఆదాయపు పన్నుశాఖ అధికారులకు సమాచారం అందింది. తక్కువ కాలంలో దూబే ఎలా కోట్లు గడించాడు అన్న దానిపై ఐటీ శాఖ అధికారులు దర్యాప్తు చేయాలని నిర్ణయించారు.

ఉజ్జయినిలో దూబేను అరెస్టు చేయగానే, అతనితోపాటు అతని బంధువుల పేర్లతో ఉన్న ఆస్తుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఆదాయపు పన్నుశాఖ పరిశోధన విభాగం అధికారులు దూబే బినామీ ఆస్తులపై దర్యాప్తు చేయాలని నిర్ణయించింది. వికాస్‌ దూబే సన్నిహిత బంధువుల పేరిట దుబాయ్, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌తో పాటు పలు దేశాల్లో ఆస్తులున్నాయని వెల్లడైంది. దూబే 8 నెలల క్రితం లక్నో నగరంలో రూ.5కోట్లు వెచ్చించి ఓ భవనం కొన్నాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతోపాటు బ్యాంకాంక్‌ నగరంలో ఓ హోటల్‌లో వికాస్‌ దూబే పెట్టుబడి పెట్టాడని సమాచారం.

వికాస్‌ దూబేకు 12 ఇళ్లు, 21 ఫ్లాట్లు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. దూబే సన్నిహితడి పేరిట ఆర్యనగర్‌లో రూ.28 కోట్ల ఆస్తులున్నాయని తేలింది. ఆర్యనగర్‌లో దూబే సన్నిహితుడి పేరిట 8 ఫ్లాట్లు ఉన్నాయని, వీటి విలువ 5కోట్ల రూపాయలుంటుందని తేల్చారు. కాన్పూర్‌ నగరంలోని పంకీ ప్రాంతంలో దూబేకు డూప్లెక్స్‌ బంగళా ఉంది. దీని విలువ రూ.2కోట్లు అని పోలీసులు చెప్పారు. ఐటీ అధికారులు దూబేతోపాటు అతని బంధువులు, సన్నిహిత అనుచరుల పేరిట ఉన్న ఆస్తుల గురించి సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు.

You might also like