FbTelugu

ఆందోళన విరమించిన జూడాలు

హైదరాబాద్: గాంధీ ఆసుపత్రి జూనియర్ డాక్టర్లు తమ ఆందోళన విరమించి విధుల్లో చేరారు. మంగళవారం నుంచి జూడాలు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.

గాంధీ ఆసుపత్రిలోని కాన్ఫరెన్స్ హాలులో జూడాలతో ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సమావేశమయ్యారు. చర్చలు సఫలం కావడంతో ఆందోళన విరమించి, విధుల్లో చేరుతున్నట్లు మంత్రి సమక్షంలోనే జూడాలు ప్రకటించారు. ప్రధానంగా ఐదు డిమాండ్లను మంత్రి ముందు ప్రస్తావించగా సానుకూలంగా స్పందించడంతో సమస్యకు ముగింపు లభించింది.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రోజుల తరబడి ఇంటికి వెళ్లకుండా పేషెంట్లకు చికిత్స అందిస్తున్నారు. చిన్న పిల్లలు ఉన్న తల్లులు సొంత బిడ్డలను ఎత్తుకోలేక పోతున్నారు, పాలు కూడా ఇవ్వకుండా ఉన్నవారు ఎంతో మంది.. ఇలా త్యాగం చేసి సమాజం కోసం పనిచేస్తున్న వారి మీద దాడులు చేయడం హేయమైన చర్య అన్నారు. గాంధీ లో కరోనా పేషంట్ల కు అమ్మ నాన్న అన్నీ తామే అయి సేవ చేస్తున్నారు. దయచేసి డాక్టర్ల మీద, వైద్య సిబ్బంది మీద దాడులు చేయవద్దని ఈటల విజ్ఞప్తి చేశారు.

You might also like