FbTelugu

శవాల గుట్టగా గాంధీ హాస్పిటల్

3 రోజుల్లోనే పదుల సంఖ్యలో మృతి?
హైదరాబాద్: సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ లో శవాలు గుట్టలుగా పేరుకుపోయాయి. ఇదే పరిస్థితి కొనసాగితే భద్రపర్చేందుకు మార్చూరీలో స్థలం లభ్యం కాక ఆరుబయట పడేసే పరిస్థితులు ఉన్నాయి.

మూడు రోజుల వ్యవధిలోనే పదుల సంఖ్యలో కరోనా రోగులు మరణించినట్లు తెలిసింది. దీనిపై హాస్పిటల్ వర్గాలు అధికారికంగా వెల్లడించనప్పటికీ ఈ సంఖ్య మరింత ఎక్కువే ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మృతదేహాలతో గాంధీ కరోనా మార్చురీ నిండిపోవడంతో జనరల్ మార్చురీ బిల్డింగ్‌ను కూడా కరోనా మార్చురీగా మార్చేశారంటున్నారు. పూర్తిగా కరోనా హాస్పిటల్ గా మార్చడంతో ఇతర మృతదేహాలకు పోస్టుమార్టం లు నిలిపివేశారు. పోస్టుమార్టం కోసం వచ్చే ఇతర మృతదేహాలను ఉస్మానియా హాస్పిటల్ కు పంపిస్తున్నారు.

రాష్ట్రంలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారిలో కొందరి పరిస్థితి విషమంగా మారుతున్నది. వారి నుంచి డబ్బులు గుంజాల్సినంతగా గుంజేసిన తరువాత ప్రైవేటు హాస్పిటల్ యాజమాన్యాలు గాంధీకి తీసుకువెళ్లమని చేతులెత్తేస్తున్నారు. మా ప్రయత్నం మేము చేశాం, ఇక ఏం చేయలేమని చెబుతున్నారు. రోగి కుటుంబ సభ్యులు కూడా లక్షలు ఖర్చు చేసిన తరువాత చివరి ఆశతో గాంధీకి తీసుకువెళ్తున్నారు. ఇలా గాంధీ హాస్పిటల్ కు వస్తున్న కేసులు 30 నుంచి 40 శాతం వరకు ఉండవచ్చని అంటున్నారు. వెంటిలేటర్ పై ఉన్న వారిని కాపాడేందుకు డాక్టర్లు శతవిధాలా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోతోంది. ఈ కారణంతోనే గాంధీలో కరోనా మరణాలు అత్యధిక సంఖ్యలో నమోదవుతున్నాయని ప్రభుత్వం, వైద్యులు అంటున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.