FbTelugu

పేదల నుంచి పెద్దల దాకా..!

తెలంగాణలో కరోనా విశ్వరూపం దాలుస్తోంది. వారు.. వీరూ అనే తేడా లేకుండా అందరితో చెడుగుడు ఆడేస్తోంది. కరోనా ప్రారంభంలో తెలంగాణలో దాని ప్రభావం తక్కువగా ఉన్నా ప్రస్తుతం అది భారీస్థాయిలో రెచ్చిపోతోంది.

మొదట్లో ఇది విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారా రాష్ట్రంలోకి చేరింది. అప్పట్లో ఇది పేదలకు మాత్రం ఎక్కువగా సోకింది. ఇరుకు గదుల్లో నివశించడం, కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఎక్కువమంది పేదలు దీని బారిన పడ్డారు. ఆ తర్వాత వలస కార్మికులు కూడా కరోనా ధాటికి గడగడలాడారు. ఆ తర్వాత దీని ప్రతాపాన్ని వైద్యసిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, జర్నలిస్టులకు చూపింది.

తాజాగా ఇప్పుడు ఆ వైరస్‌ రాజకీయ నాయకులకు చేరింది. ఇప్పటికే అధికార పార్టీకి చెందిన జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో అతడు హైదరాబాద్‌లోని యశోదా ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో ఎమ్మెల్యే స్థాయి వ్యక్తికి కరోనా సోకడం ఇదే మొదటిసారి. అయితే, కరోనా కాలంలో ఈ ఎమ్మెల్యే నిజయోజకవర్గంలోని అనేక ప్రాంతాల్లో తిరిగి పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.

అధికారిక కార్యక్రమాల్లో కూడా జోరుగా పాల్గొనానరు. ఈ కార్యక్రమాల్లో ఆయనతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ నాయకులు, అధికారులు కూడా పాల్గొన్నారు. ఇప్పుడు వీరంతా టెన్షన్‌కు గురవుతున్నారు. తమకు కూడా ఎక్కడ ఈ వైరస్‌ అంటుకుందోనని ఆందోళన చెందుతున్నారు. రెండు రోజుల క్రితం హైదరాబాద్‌ నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ కారు డ్రైవర్‌కు కరోనా బయటపడింది. దీంతో అతడిని అసుపత్రిలో చేర్చారు. మేయర్‌కు కూడా పరీక్షలు నిర్వహించారు. అయితే, అంతకుముందే మేయర్‌ కరోనా పరీక్షలు చేయించుకున్నారు. దానిలో ఆయనకు నెగెటివ్‌ రిపోర్టు వచ్చింది.

తాజాగా శుక్రవారం రెండోసారి జరిపిన టెస్టుల్లోనూ నెగెటివ్‌ వచ్చింది. దీంతో ఆయన కుటుంబంతో సహా హోం క్వారంటైన్‌కు వెళ్లారు. తాజాగా శుక్రవారం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు పీఏకు కూడా కరోనా సోకిందన్న విషయం తేలింది. దీంతో హరీష్‌రావుకు కూడా టెస్టులు చేశారు. అయితే, ఆయనకు నెగెటివ్‌ రావడంతో స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. యాదాద్రి భువనగిరి జిల్లా జెడ్పీ సీఈఓకు కూడా కరోనా సోకింది. అయితే, సీఈఓ ఇటీవల కాలంలో అనేకమంది జిల్లాస్థాయి అధికారులతో సమీక్షలు నిర్వహించారు.

వారితో క్లోజ్‌గా ఉన్నారు. దీంతో ఆ అధికారుల్లో భయం పట్టుకుంది. తమకు కూడా ఈ వైరస్‌ సోకిందేమోనన్న భయంతో ఆ జిల్లా కలెక్టర్‌తో పాటు సుమారు 80శాతం మంది జిల్లాస్థాయి అధికారులు హోం క్వారంటైన్‌కు వెళ్లారు. వాస్తవానికి శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా పరిషత్‌ సాధారణ సమావేశం నిర్వహించాలని అధికారులు ముందుగా నిర్ణయించారు. అయితే, జెడ్పీ సీఈఓకు కరోనా సోకడం, అది తమకు కూడా అంటిందేమోనన్న అనుమానంతో జిల్లాస్థాయి అధికారులు స్వీయ నిర్బంధంలో ఉండడంతో ఈ సమావేశానికి జెడ్పీ వైస్‌ చైర్మన్‌ మినహా ఎవరూ హాజరు కాలేదు. దీంతో సమావేశం వాయిదా పడింది. ఇలా కరోనా ఇప్పుడు రాజకీయ నాయకులు, ఉన్నత స్థాయి అధికారులను కూడా వదల్లేదు.

You might also like