FbTelugu

పొత్తుకోసం పాకులాట!

ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌ ఒకటి నడుస్తోంది. నిన్నటి దాకా తిట్టిపోసిన పార్టీకి అనూహ్యంగా వామపక్షాలు మద్దతు పలకడం ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీనిపై వామపక్షాలకు చెందిన కార్యకర్తలు విమర్శలకు దిగడమే కాకుండా ఏకంగా సోషల్‌ మీడియాలో కూడా బజారుకెక్కి పార్టీ నేతల చర్యలను దారుణంగా తిట్టి పోస్తున్నారు.

తాజాగా నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల్లో వామపక్షాలు టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తున్నట్టు ప్రకటన రావడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. కేసీఆర్‌ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని, కేవలం వారి కుటుంబం ఆస్తులు పెంచుకుంటున్నారు తప్ప ప్రజల కష్టాలు పట్టించుకోవడం లేదని, ఇంకా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అలాంటి పార్టీపై ఒక్కసారిగా వామపక్షాలకు ఎందుకు గాలి మళ్లిందో తెలియక ఆ పార్టీల కార్యకర్తలే జుట్టు పీకక్కుంటున్నారు. దీనిని సమర్ధించుకునేందుకు వామపక్ష నేతలు జాతీయ స్థాయిలో బీజేపీని నిలువరించేందుకు ప్రాంతీయ పార్టీల మద్దతు అవసరమని చెబుతున్నారు. అందుకే తెలంగాణలో టీఆర్‌ఎస్‌ను బలపరుస్తున్నట్టు చెబుతున్నారు. కాంగ్రెస్‌ ప్రత్యామ్నాయ శక్తిగా లేదని, అందుకే ఆ పార్టీకి మద్దతు ఇవ్వడం లేదని కూడా చెబుతున్నారు. అలా అయితే, వారి చెప్పిన ప్రచారం బెంగాల్‌లో ప్రాంతీయ పార్టీ తృణమూల్‌ పార్టీకి మద్దతు ఇవ్వాలి. ఏపీలో వైసీపీకో లేదా టీడీపీకో మద్దతు ఇవ్వాలి. ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రాంతీయ పార్టీలకు మద్దతు ఇవ్వాలి. కానీ, బెంగాల్‌లో వారు చెప్పిన ఫార్మూలాకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌కు మద్దతిచ్చారు. ఇతర రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్‌ భాగస్వామ్య పక్షాలతో పొత్తుకు దిగారు. మరి దీని అర్ధం ఏమిటని వామపక్ష కార్యకర్తలు సోషల్‌ మీడియాలో జోరుగా ట్రోల్‌ చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఖమ్మం కార్పొరేషన్‌ ఎన్నికల్లో కూడా వామపక్షాలు టీఆర్‌ఎస్‌తో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాయట. అయితే, ఈ పొత్తుల వెనుక అనేక కారణాలున్నాయన్న చర్చ జోరుగా సాగుతోంది.

అసలు ఎజెండా ఇదేనా..?
కొంతకాలంగా తెలంగాణతో పాటు దేశంలో వామపక్షాలు తమ ప్రాబల్యాన్ని కోల్పోతున్నాయి. అందులో భాగంగానే తెలంగాణ అసెంబ్లీలో ఒక్కస్థానం కూడా లేకుండా పోయింది. ప్రజాప్రతినిధుల సంఖ్య తెలంగాణలో సింగిల్‌ డిజిట్‌కు వచ్చింది. ఇప్పట్లో ఆ పార్టీలు పుంజుకునే పరిస్థితి కూడా కనిపించడం లేదు. పైగా పాత తరం కొందరు మరణిస్తుండగా.. మరికొందరు ఇతర పార్టీల్లోకి వలసలు కట్టారు. దీంతో ఈ పార్టీల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. దీంతో రాష్ట్రంలో ఎంతోకొంత ఉనికి కలిగి ఉండాలంటే మళ్లీ కొన్నిచోట్లయినా అధికారంలో ఉండాలన్న భావన వామపక్ష నేతల్లో ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ ఇక్కడ ప్రబల శక్తిగా ఎదిగేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే టీఆర్‌ఎస్‌ కూడా కొంత వెనుకబడుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని నిలువరించాలంటే టీఆర్‌ఎస్‌కి కొందరు మద్దతు అవసరం. దీనిని గ్రహించిన వామపక్షాలు ముందుగానే ఆ పార్టీ పొత్తుకోసం పాచికలు వేస్తున్నట్టు రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. అందుకే టీఆర్‌ఎస్‌ అడగకపోయినా నాగార్జునసాగర్‌లో ఆ పార్టీకి మద్దతిస్తున్నట్టు వామపక్ష నేతలు ప్రకటించారని, ఇప్పుడు ఖమ్మంలో కూడా కామ్రేడ్లు కారుకు జైకొట్టే ఆలోచనలో ఉన్నారట. మొత్తానికి వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి టీఆర్‌ఎస్‌ నేతల మనసు చూరగొని ఆ పార్టీతో పొత్తు పెట్టుకునే ఆలోచనల్లో భాగంగానే ఇప్పుడు సాగర్‌లో టీఆర్‌ఎస్‌ పంచన కామ్రేడ్లు చేరుతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.