FbTelugu

ఆనందయ్య ‘‘యాదవుడు’’ కాబట్టే కక్ష: సోమిరెడ్డి

నెల్లూరు: ఆనందయ్య అగ్రకులానికి సంబంధించిన వ్యక్తి అయితే ఇలా నిర్బంధించగలిగే వారా? ఆయనను నిర్బంధించడం న్యాయం కాదు.. వెంటనే ఆయనకు స్వేచ్ఛ కల్పించాలని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.
పేదలకు ఉచితంగా సేవ చేస్తున్న యాదవ కులానికి చెందిన ఆనందయ్యను అనధికారికంగా నిర్బంధించడం బాధాకరం అన్నారు. ఇవాళ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, వైసిపి నాయకులు పేదలకు మాత్రం మందు పంపిణీ ఆపేసి పెద్దోళ్లకు మాత్రం ప్యాకెట్లు చేసి పంపిస్తున్నారని, ఇదెక్కడి న్యాయమని మండిపడ్డారు. మందు పంపిణీ విషయంలోనూ వెంటనే నిర్ణయం తీసుకోకపోతే ప్రజలు క్షమించరన్నారు. మందుపై అనుమానం ఉన్నవాళ్లు దానిని వాడవద్దని, దూరంగా ఉండవచ్చని ఆయన అన్నారు. కృష్ణపట్నం పోర్టులోని సివిఆర్ ఫౌండేషన్ బిల్డింగ్ లో అనధికారికంగా వేలాది మందికి తయారుచేయించుకుంటారా అని ఆయన వైసిపి నేతలను ప్రశ్నించారు. ఆనందయ్య మందుతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని ఆయుష్ కమిషనర్ కర్నల్ రాములు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ ప్రకటించినా పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఎందుకు ఇవ్వడం లేదని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు.

ఆనందయ్య యాదవ కులానికి చెందిన వ్యక్తి కాకుండా అగ్రవర్ణానికి చెందిన వ్యక్తి అయివుండుంటే ఇన్ని రోజులు అక్రమంగా నిర్బంధించేవారా అని రాష్ట్రప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేదం మందు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోకపోవడం దురదృష్టకరమన్నారు. ఎంతో సౌమ్యుడైన ఆనందయ్య… తన తల్లి వారసత్వాన్ని కొనసాగిస్తూ 40 ఏళ్లుగా ఆయుర్వేద మందు పంపిణీ చేస్తున్నారు. కరోనా కు సంబంధించి 70 వేల మంది వరకు మందు తీసుకుంటే ఏ ఒక్కరూ వ్యతిరేకంగా సమాధానం చెప్పలేదని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడే కాదు 40 ఏళ్లలో ఎప్పుడూ ఆనందయ్య మందు గురించి ఒక్క ఫిర్యాదు కూడా లేదన్నారు. ఆయన తయారు చేసిన మందు మింగానని ఒంగోలు ఎంపి మాగుంట శ్రీనివాసులురెడ్డి తెలిపారు. మందుపై పూర్తి నమ్మకం ఉందని ప్రకటించారు. ఒంగోలు వాసులందరూ కూడా ఆ మందు కోరుకుంటున్నారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వెల్లడించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.