FbTelugu

కెసిఆర్, తెలంగాణ ఆత్మగౌరవం మధ్యే పోటీ: ఈటల

హైదరాబాద్: హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కెసిఆర్ కుటుంబానికి, తెలంగాణ ప్రజలకు మధ్య జరుగుతున్న యుద్దమని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఈ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటారని ఆయన పునరుద్ఘాటించారు
ఇవాళ తన రాజీనామాను అసెంబ్లీ స్పీకర్ కు సమర్పించే ముందు గన్ పార్క్ వద్ద ఈటల రాజేందర్ అమరవీరులకు నివాళులు అర్పించారు. ఆ తరువాత స్పీకర్ కార్యాలయంలో రాజీనామా అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా కట్టడికి సిఎం కెసిఆర్ సరైన చర్యలు తీసుకోలేదని, రోగులకు సరిపడా వైద్య సదుపాయాలు సమకూర్చలేదని ఆరోపించారు. కరోనా వైరస్ పట్ల పూర్తి నిర్లక్ష్యం ప్రదర్శించారని, అందువల్లే ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని అన్నారు. వేలాది మంది చనిపోయినా కెసిఆర్ నిమ్మకు నీరెత్తని విధంగా ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారన్నారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు టిఆర్ఎస్ బి ఫారం ఇచ్చినా, గెలిపించింది మాత్రం ప్రజలేనన్నారు. 17 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా కొనసాగాను, బిజెపిలో చేరుతుండడంతో రాజీనామా చేస్తున్నానని చెప్పారు.

తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పాలన జరగడం లేదని, నిరుద్యోగుల సమస్యను పట్టించుకోవడం లేదన్నారు. ఏ లక్ష్యం కోసం పోరాడి తెలంగాణ తెచ్చుకున్నామో ఆ దిశగా ఫలాలు అందడం లేదని ఆయన విమర్శించారు. నియంతృత్వ పోకడలను తుదముట్టించేందుకు నిరంతరం పోరాటాం చేస్తానన్నారు. డబ్బులు, మందు ప్రలోభాలను తొక్కిపడేసి మళ్లీ అసెంబ్లీలో అడుగుపెడతానని ఈటల ప్రతినబూనారు. రేషన్ కార్డులు, ఫించన్ కెసిఆర్ ఇంటి నుంచి ఇవ్వడం లేదన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.