కడప: మాజీ ఎంపి వైఎస్.వివేకానంద రెడ్డి హత్య కేసులో తనకు సంబంధం ఉంటే ఎక్కడైనా బహిరంగంగా ఉరి తీయొచ్చని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి స్పష్టం చేశారు.
వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి ఆదినారాయణరెడ్డి మీడియాతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2019, మార్చి 15న అనుమానాస్పద స్థితిలో తన నివాసంలోనే వివేకానంద రెడ్డి చనిపోయారని ఆయన అన్నారు. ఈ దారుణ హత్యపై సిబిఐ విచారణ చేస్తోందని, నివేదిక సమర్పించలేదన్నారు. తను హత్య చేసినట్లు అనుమానం ఉంటే వైఎస్ కుటుంబ సభ్యులు ఢిల్లీలోని సీబీఐ కార్యాలయం ఎదుట ధర్నా చేయాలని డిమాండ్ చేశారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో సిఎం వైఎస్ జగన్ కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణలన్నీ పూర్తిగా నిరాధారమని ఆయన ఖండించారు. రాష్ట్రంలో జగన్ సిఎం గా ఉన్నారని, కేంద్రంలో ఆయన మద్దతిస్తున్న ప్రభుత్వం ఉండగా విచారణ ఎందుకు ఆలస్యమవుతుందో కుటుంబ సభ్యులే తేల్చుకోవాలని ఆదినారాయణరెడ్డి సవాల్ విసిరారు.