FbTelugu

విరాళమివ్వకుంటే ఇంటి ముందు మరక!

బెంగళూరు: అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి విరాళాలు ఇవ్వని ఇళ్ల ముందు నల్లటి మరకలు పెడుతున్నారని కర్ణాటక మాజీ సీఎం హెచ్.డి.కుమార స్వామి సంచలన ఆరోపణలు చేశారు.
సీఎం యడ్యూరప్ప నేతృత్వంలోనే ఈ అరాచకం జరుగుతోందని ఆయన అన్నారు. జర్మనీలోని నాజీ పార్టీతో ఆర్ఎస్ఎస్ ను ఆయన పోల్చారు. ఆర్ఎస్ఎస్ వైఖరిని దుయ్యబడుతూ ఆయన ట్వీట్లు చేశారు. జర్మనీలో హిట్లర్ పాలనలో నాజీయేతరులు లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారని, ఆయన విధానాన్నే కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నదని కుమార స్వామి విమర్శించారు.

రామాలయం నిర్మాణం కోసం ప్రజల నుంచి బెదిరించి విరాళాలు వసూలు చేస్తున్నారని, ఇవ్వని వారి ఇంటి ముందు మరక అంటిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఇవ్వని వారిని సమాజంలో దోషులుగా నిలబెట్టేందుకే ఈ దుందుడుకు చర్యలకు దిగుతున్నారన్నారు. ఇలాంటి ఘటనలను మీడియా కూడా సమర్థిస్తే రాబోయే రోజుల్లో పరిస్థితి మరింతగా దిగజారుతుందని కుమార స్వామి అన్నారు.
బీజేపీ పాలనలో దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతుందని, ఇంతటి దారుణమైన పరిస్థితి ఎప్పుడూ చూడలేదని కుమారస్వామి ఖండించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.