FbTelugu

సంచలనాలతో తెరపైకి!

మాజీ ఉప ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ నేత కడియం శ్రీహరి కొంతకాలంగా ఎక్కడా కనిపించడం లేదు. టీఆర్‌ఎస్‌ నేతలు, ప్రధానంగా కేసీఆర్‌ ప్రత్యేకంగా మాట్లాడి టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేర్చుకున్న కడియం శ్రీహరికి మొదట్లో కేసీఆర్‌ మంచి ప్రాధాన్యమే ఇచ్చారు. విద్యాశాఖతో పాటు డిప్యూటీ సీఎం పదవిని కూడా అప్పజెప్పారు. పక్కనే తిప్పుకున్నారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య తేడాలు వచ్చాయి. కనీసం ఎమ్మెల్యే టికెట్‌ కూడా ఇవ్వలేదు. దీంతో కడియం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. పెద్దగా పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం లేదు. కొంతకాలంగా స్తబ్ధుగా ఉన్న ఆయన ఒక్కసారిగా హాట్‌హాట్‌ విమర్శలతో తెరపైకి వచ్చారు. మరో మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ఆయనపై కీలక వ్యాఖ్యలు చేసి రాజకీయవర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారారు. సొంత పార్టీ నేతపై ఆయన చేసిన కామెంట్స్‌ ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీశాయి. స్టేషన్‌ ఘనపూర్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను ఉద్దేశించి టీఆర్‌ఎస్‌ నేత కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. చేతకానివాడు, ఒక్క రూపాయి కూడా సహాయం చేయనివాడు చాలా మాట్లాడతాడని.. చెల్లని రూపాయి అని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్కరి దగ్గర ఛాయి తాగినా… పదవి ఇప్పిస్తాననో… పనులు ఇప్పిస్తాననో ఒక్క రూపాయి తీసుకోలేదన్నారు. అలా తీసుకున్నట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానని సవాల్‌ విసిరారు కడియం. పదవులు అమ్ముకుంటున్నారు, పనులు అమ్ముకుంటున్నారని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నెత్తిమీద పది రూపాయలు పెడితే అమ్ముడు పోనివారు కూడా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కడియం వ్యాఖ్యలతో స్టేషన్‌ఘనపూర్‌ రాజకీయం వేడెక్కింది. కడియం, రాజయ్య ఇద్దరు కూడా ఉప ముఖ్యమంత్రులుగా పనిచేసిన విషయం తెలిసిందే.

అయితే నియోజకవర్గంలో ఇద్దరు మాజీ ఉప ముఖ్యమంత్రుల మధ్య మాటల యుద్ధంతో వీరి మధ్య వార్‌ ఆఫ్‌ వర్డ్స్‌ ముదిరింది. ఇన్నాళ్లూ స్తబ్ధుగా ఉన్న కడియం శ్రీహరి ఒక్కసారిగా తమ పార్టీ ఎమ్మెల్యేపైనే ఇంతలా వ్యాఖ్యలు చేయడానికి కారణం ఏమిటన్న అంశం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. అయితే, తాటికొండ రాజయ్యపై అనేక ఆరోపణలు రావడంతో కేసీఆర్‌ ఆయనకు అప్పగించిన డిప్యూటీ సీఎం పదవిని కూడా తిరిగి తీసేసుకున్న విషయం విధితమే. అయినా, తరచూ ఆయన వివాదాల్లోకి వస్తూనే ఉన్నారు. అయితే, నిరంతరం వివాదాలకు కారణమవుతున్న రాజయ్యకు నియోజకవర్గంలో వ్యతిరేకత పెరుగుతుందన్న విషయాన్ని గ్రహించిన కడియం రానున్న ఎన్నికల్లో అక్కడ నుంచి పోటీకి దిగే ఆలోచనలో ఉన్నారని, ఒకవేళ టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఇవ్వకున్నా బరిలో నిలవాలన్న ఆలోచనలో ఉన్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే ఇప్పటినుంచే తాటికొండ రాజయ్యను టార్గెట్‌ చేసి తన గెలుపునకు బాటలు వేసుకుంటున్నారన్న ప్రచారం కూడా సాగుతోంది. అందులో భాగంగానే కడియం శ్రీహరి తాటికొండ రాజయ్యపై తీవ్ర విమర్శలకు దిగారన్న ప్రచారం కూడా సాగుతోంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.