FbTelugu

500లోపు కుటుంబాలకే..

తెలంగాణలో కరోనా అల్లకల్లోలం సృష్టించింది. సుమారు 1592 వరకు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీరిలో ప్రధానంగా ఇతర దేశాల నుంచి వచ్చిన వారి నుంచి కరోనా రంగంలోకి దిగింది.

చివరకు విదేశాల నుంచి రాకపోకలు ఆగడంతో కరోనా కూడా కంట్రోల్‌లోకి వచ్చింది. అయితే, అదే సమయంలో నిజాముద్దిన్ మర్కజ్‌ మసీదు రూపంలో మరోసారి విజృంభించింది. ఢిల్లీ మర్కజ్‌ ప్రార్థనలకు వెళ్లివచ్చిన వారిని వెతికి క్వారంటైన్లకు పంపేందుకు సర్కారుకు ఎక్కువ సమయమే పట్టింది. ఈ లోపు వారిద్వారా మరింత వ్యాప్తి జరిగింది. ఇది కూడా కంట్రోల్‌ అవుతన్న తరుణంలో వలస కార్మికుల రూపంలో మరోసారి ప్రమాదం వచ్చిపడింది.

ప్రస్తుతానికి హైదరాబాద్‌ నగరంలో మినహా జిల్లాల్లో ఎక్కడా పాజిటివ్‌ కేసులు నమోదు కావడం లేదు. రాష్ట్రాన్ని ఇంతగా వణికించిన ఈ వైరస్‌ ఎన్ని కుటుంబాలకు సోకిందో తెలుసా.. కేవలం 485 కుటుంబాలకు మాత్రమే. ఏమిటి నమ్మలేకపోతున్నారు కదా.. నిజమే, చాలా తక్కువ కుటుంబాలకు మాత్రమే కరోనా సోకింది. కానీ, ఒక్కో ఇంట్లో 7నుంచి 14మంది వరకు సోకిన దాఖలాలు ఉన్నాయి. దీంతో తక్కువ కుటుంబాలకు సోకినా సంఖ్య మాత్రం భారీగానే ఉంది. అది కూడా ఎక్కువ శాతం అపార్ట్‌మెంట్లలో, పుట్టిన రోజు వేడుకలు నిర్వహించిన వారికే ఎక్కువగా వైరస్‌ వ్యాప్తి చెందినట్టు కూడా ఉదాహారణలు కనిపిస్తున్నాయి.

ఎక్కువ కేసులు హైదరాబాద్‌ నగరం పరిధిలో 168 కుటుంబాలకు ఈ వైరస్‌ సోకగా, రంగారెడ్డి జిల్లాలో 59, మేడ్చల్‌ జిల్లాలో 39 కుటుంబాలు ఈ వైరస్‌ బారిన పడ్డాయి. ఇక, జయశంకర్‌ భూపాలపల్లి, మహబూబాబాద్, నారాయణపేట, సిద్దిపేట జిల్లాల్లో అతి తక్కువగా ఒక్కో కుటుంబం వైరస్‌ బారిన పడినట్టు అధికారులు చెబుతున్నారు.

You might also like