FbTelugu

స్మశానాల్లోనూ ఫ్లెక్సీలు… బిజెపిపై జనం మండిపాటు

బెంగళూరు: ప్రచార పైశాచికం అంటే ఇదేనేమో. చివరకు స్మశాన వాటికల్లోనూ కూడా ప్రచారం చేసుకుంటున్న బిజెపి నేతలపై నెటిజన్లు మండిపడుతున్నారు. బిజెపి నేతల వైఖరిపై సోషల్ మీడియాలో చివాట్లు పెడుతున్నారు. నేలమంగళ తాలూకా గిడ్డెనహళ్లి లో కరోనా మృతుల కోసం ప్రత్యేకంగా అంత్యక్రియలు జరిపేందుకు స్మశాన వాటిక ఏర్పాటు చేశారు. పిచ్చి ముదిరిన బిజెపి నాయకులు ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి యడియూరప్ప, రెవెన్యూ శాఖ మంత్రి ఆర్.అశోక్, బిడిఏ అధ్యక్షుడు ఎస్ఆర్. విశ్వనాథ్ స్థానిక నేతల ఫొటోలతో ఫ్లెక్సీ తయారు చేయించారు.

స్మశానానికి దారి ఇలా ఉందంటూ అందులో చూపిస్తూ, అంత్యక్రియలకు వచ్చేవారికి ఫ్రీ వాటర్, కాఫీ, భోజనం ఏర్పాటు చేశామంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ఈ ఫ్లెక్సీ ఫోటోలు ఎవరో సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయ్యాయి. ఇంకేముంది నేలమంగళ బిజెపి నాయకులను పార్టీ పెద్దలు పిలిపించి చెడామడా తిట్టారు. ప్రజల నుంచి కూడా వ్యతిరేకత రావడంతో సోమవారం సాయంత్రం ఫ్లెక్సీ తీసేసి, క్షమాపణలు కూడా చెప్పారు. అయితే అప్పటికే సోషల్ మీడియాలో జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మీకు సిగ్గు, మర్యాద ఏమైనా ఉందంటూ కామెంట్లు పెట్టారు. కరోనాతో శవ రాజకీయాలు చేస్తారా అంటూ మండిపడ్డారు. నవ్వుతూ ఉన్న యడియూరప్ప ఫొటో పెట్టడం కూడా నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.