FbTelugu

విశాఖ నుంచి తొలి ‘ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్’

దేశంలోనే మొట్టమొదటి ట్రైన్ ఇదే
విశాఖపట్నం: నేడో రేపో ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ దేశంలో పలు ఆసుపత్రులలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నవారికి ఆక్సిజన్ సరఫరా చేసే పనిలో నిమగ్నమై ఉంది.

ఆక్సిజన్ లేకపోవడంతో చాలాచోట్ల కరోనా రోగులు మరణిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచాలని కేంద్రం విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఆదేశాలిచ్చింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ నాలుగైదు రోజుల క్రితమే ఆక్సిజన్ ఉత్పత్తిని పెంపుదల చేసింది. ద్రవ ఆక్సిజన్‌ను తీసుకెళ్లేందుకు మొదటి ‘ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్’ రైలు విశాఖపట్టణానికి చేరుకుంది. ఇక్కడ ద్రవ ఆక్సిజన్‌ను నింపిన వెంటనే మరలా మహారాష్ట్రకు బయలుదేరనుంది. అయితే ఈ గూడ్స్ రైలు మార్గమధ్యంలో ఆగకుండా రైల్వే శాఖ ప్రత్యేక ప్రణాళికలు చేసింది. భద్రతాపరమైన సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ఈ ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌కి సాయుధ దళాలు పహారా కాస్తున్నాయి.

మహారాష్ట్ర నుంచి మొదటి ‘ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్’ సోమవారం సాయంత్రం కలంబోలి యార్డ్ నుంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కు బయలుదేరింది. ఈ రైలు వాసై రోడ్, జల్గావ్, నాగ్‌పూర్, రాయ్ పూర్ జంక్షన్ మీదుగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కు చేరుకుంది. ఈ రోజు లిక్విడ్ ఆక్సిజన్‌ను నింపిన వెంటనే మరలా మహారాష్ట్రకు బయలుదేరనుందని అధికారులు తెలిపారు. ప్రస్తుత కరోనా విపత్కర పరిస్థితుల్లో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ అత్యధికంగా సహజ వాయువును ఉత్పత్తి చేస్తూ మన్ననలు పొందుతోంది. కేంద్రం వదిలించుకోవాలని చూసిన ప్లాంటే ఇప్పుడు ఊపిరిపోస్తుందంటూ ప్రజలు, మేధావులు, ప్రతిపక్షాలు కీర్తిస్తున్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.