FbTelugu

ఫైర్‌బ్రాండ్‌కు అసమ్మతి పొగ

ఏపీ అధికార పార్టీలో ఫైర్‌బ్రాండ్‌ రోజా పప్పులు ఉడకడం లేదా..? ఆమెకు పార్టీలో ఎదురులేదని వస్తున్న వార్తలు వట్టి మాటలేనా..? పక్కనున్న వారే ఆమెకు పొగబెడుతున్నారా..? ఇదంతా పార్టీ అధినేత జగన్‌కు తెలియకుండానే జరుగుతుందా..? ఒకవేళ తెలిసినా ఆయన కామ్‌గా ఉన్నారా..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

వైసీపీ అధికారంలో లేనప్పుడు కూడా రోజా ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పట్లో తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడుపై అసెంబ్లీలో, బయటా ఒంటికాలుపై లేచారు. టీడీపీని విమర్శించాలంటే రోజా రావాల్సిందే అన్నట్టుగా ఉండేది అప్పటి పరిస్థితి. చివరకు అసెంబ్లీలో అవహేళన చేసిందంటూ టీడీపీ ప్రభుత్వం ఆమెను చాలారోజుల వరకు అసెంబ్లీనుంచి కూడా సస్పెండ్‌ చేసింది. ఈ వ్యవహారం ఏపీలో పెద్ద దుమారం లేపింది. అయితే, రోజా దూకుడుతనం ఎక్కువగా ఉండేదన్న భావన పార్టీలో, ప్రజల్లో కూడా బాగా ఉంది.

రోజా దూకుడుతనం జగన్‌మోహన్‌రెడ్డికి నచ్చేది కాదని, ఆమెకు ఈ విషయాన్ని ఆయన స్వయంగా చెప్పారన్న వార్తలు కూడా అప్పుడు వినిపించాయి. అయినా, ఆమెలో దూకుడు తగ్గలేదు. తదనంతర పరిణామాల్లో వైసీపీ తిరుగులేని విజయాన్ని సాధించింది. జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయ్యారు. దీంతో పార్టీలో ఎంతో చురుగ్గా ఉన్న రోజాకు మంత్రివర్గంలో మంచి పోర్టుపోలియో దక్కుతుందని రోజాతో పాటు అనేకమంది పార్టీ నేతలు, రాజకీయ విశ్లేషకులు భావించారు. కానీ, జగన్‌ ఆమెకు మంత్రి పదవిని ఇవ్వలేదు. పైగా మరో మహిళ మేకతోటి సుచరితకు హోంశాఖను అప్పగించారు. దీంతో అప్పట్లో రోజా అలిగినట్టుగా వార్తలొచ్చాయి. ఈ పరిస్థితుల్లో జగన్‌ ఆమెను పిలిచి మాట్లాడి ఏదో ఒక పదవి ఇస్తారని అంతా భావించారు. కానీ, జగన్‌ నుంచి ఎలాంటి పిలుపూ రాలేదని కూడా ఆ పార్టీ కార్యకర్తలు చెప్పుకున్నారు.

అయితే, చివరకు రోజానే జగన్‌ను కలిసి తన ఆవేదన వెలిబుచ్చిన అనంతరం ఏపీఐఐసీ చైర్మన్‌గా ఆమెకు పదవిని కట్టబెట్టారు. అయితే, ఆ పరిణామాల కాలం నుంచి సొంతపార్టీలోనే ఆమెకు అసమ్మతి నేతలు తయారవుతున్నారు. ఈ విషయం జగన్‌కు తెలిసినా పట్టించుకోవడం లేదన్న చర్చ ఆ పార్టీ కార్యకర్తల్లో సాగుతోంది. తాజాగా చిత్తూరు జిల్లా పుత్తూరులో డిప్యూటీ సీఎం నారాయణస్వామి రోజాకు సమాచారం లేకుండానే పర్యటించారు. దీంతో తన నియోజకవర్గంలో తనకు సమాచారం లేకుండా ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంలు కలెక్టర్‌తో కలిసి ఎలా పర్యటిస్తారని ఆమె మండిపడ్డారు. దీంతో డిప్యూటీ సీఎం నారాయణస్వామి కూడా రోజాపై ప్రతి విమర్శలు చేశారు. దీంతో రోజాకు చెక్‌ పెట్టేందుకు భారీస్థాయిలోనే ఆ పార్టీ నాయకులు ముందుకెళ్తున్నారన్న విషయం స్పష్టమవుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, ఈ విషయాలన్నీ జగన్‌కు తెలియకుండానే జరుగుతున్నాయా..? లేక ఆయనకు తెలిసినా పట్టించుకోవడం మానేశారా అనన అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

You might also like