FbTelugu

చిత్ర పరిశ్రమ విశాఖ రావాలని కోరాం: పేర్ని నాని

తాడేపల్లి: విశాఖపట్నానికి చిత్ర పరిశ్రమ తరలిరావాలని కోరామని, తక్కువ ధరమే భూములిస్తామని సినీ పెద్దలకు చెప్పామని ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని తెలిపారు.

ఇవాళ మధ్యాహ్నం సినీ ప్రముఖులు సీఎం జగన్ రెడ్డితో భేటీ అయిన తరువాత నాని మీడియాతో మాట్లాడారు. సినీ పరిశ్రమ సమస్యల పట్ల సీఎం జగన్ సానుకూలంగా స్పందించారని అన్నారు. విశాఖపట్నంలో సినిమా షూటింగ్ లను ప్రోత్సహిస్తామని, దానికి అవసరమైన మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తామన్నారు. స్టూడియోలు నిర్మించుకోవాలని కూడా కోరడం జరిగిందన్నారు. ఇళ్లు నిర్మించుకోవడానికి అవసరమైన స్థలాలు కూడా చౌక ధరకు ఇస్తామని చెప్పామన్నారు.

చిన్న సినిమాలను ప్రోత్సహించేందుకు రాయితీలు ఇచ్చే ఆలోచన ఉందని, థియేటర్లకు మినిమమ్ ఛార్జీలను కూడా తగ్గిస్తామని నాని వెల్లడించారు. ఈ సంవత్సరం నంది అవార్డుల బహూకరణ కార్యక్రమం ఉంటుందని, ప్రతి ఏడాది కొనసాగిస్తామని ఆయన తెలిపారు.

You might also like