FbTelugu

ఫైబర్ నెట్ లక్ష్యం 60 లక్షల వినియోగదారులు

ఏపీ ఐటీ శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి

అమరావతి: రాష్ట్ర ప్రజలకు చౌకగా ఇంటర్ నెట్ తో పాటు నాణ్యతగా ఫైబర్ నెట్ సేవలందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఐ.టీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు.
బుధవారం మంత్రి కార్యాలయంలో ఏపీ ఎస్ఎఫ్ఎల్ పై సమీక్ష నిర్వహించిన ఐ.టీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఫైబర్ నెట్ కు ఉన్న డిమాండ్ నేపథ్యంలో రానున్న రెండుమూడేళ్ల కాలంలో 60 లక్షల మంది వినియోగదారులకు ఫైబర్ నెట్ సేవలు అందిస్తామన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 10 లక్షల మందికి పైగా వినియోగదారులు ఉన్నారన్నారు.

గ్రామపంచాయతీ, మండాలలో రూటర్ల సంఖ్య వీలైనంతవరకూ తగ్గించడంపై దృష్టి సారించామన్నారు. రూటర్ల ఇన్ స్టాలేషన్ లో మరింత పారదర్శకత పాటిస్తామన్నారు. కొత్త పరికరాల సేకరణ, అంచనా, ఆర్థిక భారం తగ్గించేందుకు ‘టెక్నికల్ కమిటీ’ ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం పడకుండా ఉండేలా చూడడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని గౌతమ్ రెడ్డి వివరించారు.
నిర్దేశించుకున్న గ్రామపంచాయతీలు, మండలాల్లో పక్కాగా ఫైబర్ నెట్ వర్క్ సేవలు అందిస్తామన్నారు. ఐపీ ఎంపీఎల్ఎస్, జీపీఓఎన్ టెక్నాలజీ రాష్ట్రానికి వెన్నుముకగా మారనున్నదని మంత్రి గౌతమ్ వివరించారు. అనుకున్న లక్ష్యానికి అనుగుణంగా దశలవారీగా కొత్త వినియోగదారులను పెంచుకుంటామన్నారు.

You might also like