FbTelugu

సాగర్‌లో కోవర్టుల భయం!

అన్నా ఓటు ఎటు వేస్తున్నావే.. ఈ సారి ఎలాగైనా మా అభ్యర్థి గెలిచేట్టు చూడు. మా అభ్యర్థి సీనియర్, పైగా లోకల్‌ వ్యక్తి.. నాన్‌ లోకల్‌ అభ్యర్థిని గెలిపిస్తే రేపు మీకు అవకాశాలు రాకుండా పోతాయి.. అన్నా మా పార్టీలోకి రా.. మంచి అవకాశాలు కల్పిస్తాం.. లేదంటే ఆ పార్టీలోనే ఉండు ఓటు మాత్రం మా అభ్యర్థికి వేయించు. ఇదీ ఇప్పుడు నాగార్జున సాగర్‌ నియోజవర్గంలో వినిపిస్తున్న మాటలు.

ఇక్కడ ప్రధానంగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నోముల నర్సింహయ్య తనయుడు భగత్, కాంగ్రెస్‌ నుంచి సీనియర్‌ నేత కుందూరు జానారెడ్డి, బీజేపీ నుంచి రవికుమార్‌ బరిలో నిలిచారు. ప్రధాన పోటీ మాత్రం భగత్, జానారెడ్డి మధ్యే ఉంది. భగత్‌కు ప్రధానంగా బలం తండ్రి సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉండడం.. పార్టీ క్యాడర్, పార్టీ అధికారంలో ఉండడం, పార్టీ యంత్రాంగంతో పాటు కేబినెట్‌ మంత్రులతో పాటు ఎమ్మెల్యేలంతా అక్కడ కేంద్రీకరించి పనిచేయడం అతడికి కలిసివచ్చే అంశాలు. కాకుంటే ఆయన ప్రజలకు పెద్దగా పరిచయం లేకపోవడం, స్థానికేతరుడు అన్న ముద్ర ఆయనకు మైనస్‌ పాయింట్లుగా ఉన్నాయి. జానారెడ్డికి కూడా అనేక కలిసివచ్చే అంశాలున్నాయి. స్థానికుడు కావడం.. అన్ని గ్రామాల్లో పేరుపెట్టి పిలవగలిగే పరిచయాలుండడం.. ఇతర పార్టీల్లోనూ తనకు మంచి స్నేహితులుండడం.. సీనియర్‌ నేతగా చేసిన అభివృద్ధి పనులు ఆయనకు అండగా ఉన్నాయి. కాకుంటే పార్టీ అధికారంలో లేకపోవడం, ఆయన శిష్యులంతా ఇటీవల కాలంలో టీఆర్‌ఎస్‌లో చేరడం జానాకు కొంత మైనస్‌ పాయింట్లే. దీంతో ఇక్కడ వీరిద్దరి మధ్య పోటీ రసవత్తరంగా మారింది. విజయం కోసం ఎవరి పద్ధతుల్లో పోరాడుతూనే ఉన్నారు.

టీఆర్‌ఎస్‌ ప్రచార బాధ్యతలను బయటి నుంచి వచ్చిన టీఆర్‌ఎస్‌ నేతలకు అప్పగించడంలో స్థానిక నేతలు నారాజ్‌ అయ్యారన్న వార్తలు గుప్పుమన్నాయి. ఇప్పుడు జానారెడ్డి వాటినే తనకు ఆయుధాలుగా మలుచుకుంటున్నారన్న చర్చ జోరుగా సాగుతోంది. టీఆర్‌ఎస్‌లో ఉన్న నాయకులతోనూ జానారెడ్డికి మంచి సంబంధాలే ఉన్నాయి. వాస్తవానికి వారికి భగత్‌ కంటే జానారెడ్డితోనే మంచి సంబంధాలున్నాయి. కాకుంటే పార్టీ పరంగా చూస్తే టీఆర్‌ఎస్‌లో ఉన్నారన్న టెక్నికల్‌ తేడానే ఉంది. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌లో స్థానికులైన తమను గుర్తించకపోవడం.. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేల చేతికింద పనిచేయాల్సి రావడాన్ని తట్టుకోలేక పోతున్నారు. చివరకు డబ్బు పంపిణీలో కూడా తమకు స్వేచ్ఛనివ్వలేదన్న ఆగ్రహంతో ఉన్నారు. అదేవిధంగా టీఆర్‌ఎస్‌లోని ఓ సామాజిక వర్గం జానారెడ్డితో నిత్యం టచ్‌లో ఉందని.. తమ సామాజిక వర్గానికి చెందిన జానారెడ్డిని గెలిపించుకునేందుకు తెరచాటు రాజకీయాలు నడుపుతోందన్న వాదన కూడా వినిపిస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ టీఆర్‌ఎస్‌ నేతలను తమవైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటే.. తామేం తక్కువ తినలేదన్నట్టు టీఆర్‌ఎస్‌ కూడా కాంగ్రెస్‌ పార్టీ ప్రజాప్రతినిధులతో బేరాలు సాగిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది.

అవసరమైతే డబ్బులు ఇస్తాం.. లేకుంటే మా ప్రభుత్వం నుంచి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్న హెచ్చరికలతో వారిని లొంగదీసుకుంటున్నట్టు ప్రచారం సాగుతోంది. ఒకవేళ మీరు మా వైపునకు రాకున్నా పర్వాలేదు. కాంగ్రెస్‌లోనే ఉండి ఓట్లు మాత్రం టీఆర్‌ఎస్‌కు వేయించండి అంటూ బేరాలు సాగిస్తున్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ పరిస్థితుల్లో రేపు జరగబోయే ఎన్నికల్లో ఈ రెండు పార్టీల అభ్యర్థులను ఏ పార్టీలోని కోవర్టులు ముంచుతారోనని సాగర్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ కోవర్టుల ప్రభావం ఎంతవరకు ఉంటుందో.. వీరు ఎవరిని ముంచుతారోనన్న భయం కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల్లోనూ నెలకొంది. మరి.. కోవర్టుల ప్రభావం ఎన్నికల్లో ఎంతవరకు ఉంటుందో.. అది నిజంగా ఎవరిని ముంచుతుందో తేలాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.

You might also like

Leave A Reply

Your email address will not be published.