FbTelugu

సరిహద్దుల్లో బైఠాయించిన రైతులు

చండీఘడ్: కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా చేపట్టిన రైతుల ఆందోళన ఇంకా కొనసాగుతున్నది. ఢిల్లీకి ర్యాలీగా బయలుదేరిన రైతులను హర్యానా సరిహద్దుల్లో నిలిపివేశారు. దీంతో అక్కడే రైతులు బైఠాయించారు.

పంజాబ్, హర్యానా, యూపీ, రాజస్థాన్ కు చెందిన రైతులు ఆందోళనలో పాల్గొన్నారు. వీరిని ఢిల్లీకి రానివ్వకుండా కేంద్రంలోని బీజేపీ సర్కార్ సరిహద్దులు మూసివేయించింది. భారీ ఎత్తున భద్రతా బలగాలను మొహరించింది. గురువారం మధ్యాహ్నం నుంచి రైతులను ముందుకు సాగనివ్వకుండా పోలీసులతో అడ్డుకుంటున్నది. హర్యానా పోలీసులు రైతులపై వాటర్ కెనాన్లను ఉపయోగించడంతో పాటు ఇనుప కంచెలను ఏర్పాటు చేశారు. తోసుకుని ముందుకు వచ్చిన వారిపై బాష్పవాయువు ప్రయోగిస్తున్నారు.

అయినప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా నిన్నటి నుంచి రైతులు అక్కడే బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. దీంతో ఢిల్లీ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. ఆందోళనలో పాల్గొంటున్న రైతులు వెనక్కి పోవాల్సిందిగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి తోమర్ వినతి చేశారు. చర్చల కోసం డిసెంబర్ 3వ తేదీ ఢిల్లీ రావాల్సిందిగా ఆయన కోరారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.