FbTelugu

వారూ జత కలుస్తున్నారు!

కేంద్రం తీసుకువచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఢిల్లీలో ఆందోళనలు చేస్తున్నారు. ఈ ఆందోళనలకు అణిచివేసేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కారు నానా విధాలుగా ఆటంకాలు కల్పిస్తోంది. అయినా, ఆ రైతులు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. దేశవ్యాప్తంగా వారికి నానాటికి మద్దతు పెరుగుతోంది తప్ప తగ్గడం లేదు. సుమారు 300మంది దాకా అన్నదాతలు అసువులు బాసినా ఉద్యమాన్ని మాత్రం ఎక్కడా ఆపలేదు. వీరి ఉద్యమం అనవసరమని, రైతు చట్టాలను వెనక్కి తీసుకునేది లేదని బీజేపీ నేతలు, సర్కారు పెద్దలు ఖరాకండిగా చెబుతున్నారు.

అయితే, రైతులు చేస్తున్న పోరాటం న్యాయమైందని ఇప్పటికే అనేకమంది ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులు మద్దతు తెలపడంతో పాటు వారి పదవులకు రాజీనామా చేసి రైతులకు మద్దతుగా నిలిచారు. పలువురు సినీ కళాకారులు, కవులు, వివిధ హోదాల్లో పనిచేసి ప్రభుత్వ అవార్డులు పొందిన వారు కూడా రైతుల పోరాటానికి మద్దతుగా వారి అవార్డులను తిరిగి ప్రభుత్వానికి ఇచ్చి నిరసన తెలిపారు. ఇప్పుడు రైతుల ఆందోళనకు బీజేపీ నియమించిన అధికారులేఏ మద్దతు తెలపడం అన్నదాతలకు మరింత అండగా నిలిచింది. రైతులు చేస్తున్న పోరాటం న్యాయమని.. ప్రభుత్వం తెచ్చిన రైతు చట్టాలు వారికి నష్టాన్ని కలుగజేస్తాయని తాజాగా మేఘాలయ గవర్నర్‌ కూడా మద్దతు తెలిపారు. ‘‘కుక్క చనిపోతేనే సంతాపం తెలియజేస్తారు.. 250మంది రైతులు చనిపోతే ఎవరూ మాట్లాడడం లేదు.. రైతులు ఒట్టి చేతులతో వెళ్లకూడదు.. రైతులకు నా పూర్తి మద్దతు’’ అని కామెంట్‌ చేశారు. అంతేకాదు.. ఈ వ్యాఖ్యలు చేసినందుకు నన్ను గవర్నర్‌ పదవి నుంచి తీసేసినా సంతోషమే అన్నారంటే రైతుల పోరాటం ఎంత నికార్సయిందో అర్ధమవుతోంది. వాస్తవానికి బీజేపీ నేతల్లోనూ కొందరు రైతులది న్యాయపరమైన పోరాటమేనన్న అభిప్రాయంతో ఉన్నారు. కానీ, పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని బహిరంగంగా విమర్శించే ధైర్యం లేక కిమ్మనకుండా ఉన్నారన్న ప్రచారం సాగుతోంది. రైతులు ఎంతో త్యాగంతో చేస్తున్న పోరాటానికి నానాటికీ మద్దతు పెరుగుతోంది. ఈ పోరాటానికి మరికొద్ది రోజుల్లోనే మేఘాలయ గవర్నర్‌ లాగానే మిగతా గవర్నర్లు, బీజేపీలోని కొందరు నేతలు కూడా బహిరంగంగా మద్దతు తెలిపే పరిస్థితి కూడా రావచ్చని ఆందోళన చేస్తున్న రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా చిత్తుశుద్ధితో రైతాంగాన్ని కాపాడేందుకు అన్నదాతలు నిద్రాహారాలు మాని ఢిల్లీ సర్కారును షేక్‌ చేస్తున్న తీరుకు సర్వత్రా మద్దతు పెరుగుతుండడం సంతోషకరమైన విషయమే.

You might also like

Leave A Reply

Your email address will not be published.