న్యూఢిల్లీ: రైతు సంఘాలు ఇచ్చిన పిలుపుమేరకు రైతులు పెద్ద ఎత్తున ఢిల్లీ-జైపూర్ హైవే కు చేరుకుంటున్నారు. గుర్గాంవ్, ఫరీదాబాద్ వద్ద పోలీసు బలగాలను మొహరించారు.
హర్యానా, న్యూఢిల్లీ సరిహద్దులను కలిపే ఈ హైవే పై నిరసన తెలియచేయడం ద్వారా కేంద్రం పై ఒత్తిడి పెంచాలని రైతు సంఘాలు నిర్ణయించుకున్నాయి. దేశ వ్యాప్తంగా టోల్ గేట్ల వద్ద డబ్బులు చెల్లించకుండా నిరసన తెలపనున్నారు. న్యూఢిల్లీ సరిహద్దు ప్రాంతాలు అయిన టిక్రీ, సింఘ, ఘాజిపూర్ లను పోలీసులు మూసివేయించారు. టోల్ గేట్ల వద్ద పోలీసులు పెద్ద ఎత్తున దిగిపోయారు.
కేంద్రం అమలు చేస్తున్న వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ బారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) శుక్రవారం సుప్రీంకోర్టులో పిటీషన్ కూడా దాఖలు చేసింది. ఈ చట్టాల మూలంగా రైతులు కార్పొరేట్ కంపెనీల దయాదాక్షిణ్యాల మీద బతకాల్సిన పరిస్థితి తలెత్తుతుందని కోర్టుకు వివరించారు. ఇంతకు ముందే తిరుచ్చి శివతో పాటు ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా, చత్తీస్ ఘడ్ కిసాన్ కాంగ్రెస్ కు చెందిన రాకేశ్ కూడా సుప్రీంకోర్టులో పిటీషన్లు వేశారు.