FbTelugu

ఆర్థిక సమస్యలతో కుటుంబం ఆత్మహత్య

ప.గో.జిల్లా: దెందులూరు మండలం కొత్తగూడెం శివారు శింగవరం పొలాల్లో ముగ్గురు వ్యక్తులు పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
అప్పటికే భానువికాస్‌ మృతిచెందగా, వెంకటనారాయణ, కృష్ణతులసి ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. వీరిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆర్థిక ఇబ్బందులే వీరిని ఆత్మహత్యకు పురిగొల్పాయంటున్నారు. దెందులూరు పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలం తుర్లపాడుకు చెందిన పావులూరి వెంకట నారాయణ(70), కృష్ణతులసి దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. గుంటూరులోని రాజేంద్రనగర్‌లో ఉంటూ వ్యాపారం చేసుకుంటున్నారు. చిన్న కుమారుడు భానువికాస్‌(33)కు పదేళ్ల కిందట ప్రమాదం జరిగింది. అతను ఆరోగ్యం కోలుకోకపోవడంతో ఖర్చులు పెరిగి వ్యాపారంలో భారీగా నష్టపోయారు.

అప్పుల భారం మోయలేని విధంగా మారడంతో ముగ్గురు కలిసి పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం కొత్తగూడెం శివారు శింగవరం చేరుకున్నారు. అక్కడే ముగ్గురు కలిసి పురుగుల మందు సేవించారు. అపస్మారక స్థితిలో ఉన్న వీరిని చూసిన స్థానికులు దెందులూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరిద్దరిని ఏలూరుకు తరలించగా వైద్యులు పరీక్షించి వెంకటనారాయణ మృతి చెందినట్లు ధ్రువీకరించారు. కృష్ణతులసి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నది. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే వారు ఈ అఘాయిత్యం చేసుకున్నట్లు ఆమె సోదరుడు పారా హరిబాబు పోలీసులకు తెలిపారు. దెందులూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.