FbTelugu

రైతు మెడపై నకిలీ కత్తి

తెలంగాణ రాష్ట్రంలో నకిలీ విత్తనాల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. మార్కెట్‌లో అసలు విత్తనాలు ఏవో.. నకిలీవి ఏవో పోల్చుకోలేని పరిస్థితి నెలకొంది. తక్కువ ధరకు వస్తున్నాయి.. ఎక్కువ లాభాలు పొందవచ్చని రైతులకు ఆశచూపుతున్నారు.

దీంతో ఏటా నకిలీ బారినపడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వ్యవసాయాధికారులు నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న వారిపై దాడులు నిర్వహిస్తున్నారు. కొంతమంది బ్రోకర్లు నేరుగా రైతుల వద్దకే వెళ్లి నకిలీ విత్తనాలను అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నారు. వానాకాలం పంటలకు సిద్ధమవుతున్న రైతన్నకు వ్యాపారులు నకిలీ విత్తనాలను అంటగడుతున్నారు. ప్రభుత్వం నిషేధించిన బీటీ–3 విత్తనాలు మండలాల్లో, గ్రామాల్లో గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్నారు. వ్యవసాయశాఖ అధికారులు విత్తన విక్రయాలపై దష్టిసారించకపోవడంతో దళారుల వద్ద విత్తనాలు కొని రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు.

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో నకిలీ విత్తనాల దందా జోరుగా సాగుతోంది. సంబంధిత వ్యవసాయాధికారులు నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న వారిపై దాడులు నిర్వహిస్తున్నా.. కొంతమంది బ్రోకర్లు నేరుగా రైతుల వద్దకే వెళ్లి నకిలీ బీటీ–3 విత్తనాలను అందిస్తున్నారు. ఈఏడాది ఇప్పటివరకు రూ.కోటి విలువగల నకిలీ విత్తనాలు పట్టుబడ్డాయి. ఈసారి వానాకాలం సాగు ప్రణాళిక సిద్ధమైంది. ఇప్పటికే రైతులు వేసవి దుక్కులు దున్ని విత్తులు విత్తేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈసారి నియంత్రిత సాగుతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పత్తి సాగు గణనీయంగా పెరగనుంది. రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్‌ జిల్లాల్లో 8,56,439 ఎకరాల సాధారణ విస్తీర్ణం కాగా.. గత ఏడాది 9,83,780 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేశారు. ఈసారి 8,94,421 ఎకరాలు సాగు అవుతుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. అందులో పత్తి సాగే అధికంగా ఉంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 2,81,133 ఎకరాలు కాగా.. గతేడాది 4,12,788 ఎకరాల్లో సాగు చేశారు.

సాగు విస్తీర్ణాన్ని మించిపోయింది. ఈసారి వానాకాలంలో 4,62,549 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేసేలా వ్యవసాయ శాఖ ప్రణాళిక రూపొందించింది. గతేడాది పత్తి సాగును పోల్చుకుని చూస్తే ఈసారి 49,761 ఎకరాల సాగు విస్తీర్ణం పెరగనుంది. పెరిగిన సాగుకు అనుగుణంగా రైతులకు విత్తనాలు సరఫరా చేయడం కష్టమేనంటున్నారు. ఇదే తరుణంలో నకిలీ విత్తనాలు మార్కెట్లోకి ప్రవేశించాయి. నకిలీ విత్తనాలు అసలు విత్తనాలను పోలి ఉన్నాయి. దీంతో రైతులకు ఏది నకిలీయో.. ఏది ఒరిజినలో తేల్చుకోలేకపోతున్నారు. ఏటా నకిలీల బారినపడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గతేడాది బోల్‌గార్డు–3 పత్తి విత్తనాలతో నష్టపోయారు. ఈ విత్తనాలను ప్రభుత్వం నిషేధించినప్పటికీ లాభాలు అధికంగా వస్తాయని రైతులను మభ్యపెట్టి వ్యాపారులు సొమ్ము చేసుకున్నారు.
పట్టుబడిన నకిలీ విత్తనాలివే..
రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో పెద్ద మొత్తంలో నకిలీ విత్తనాలు పట్టుబడుతున్నాయి. వానాకాలం సాగుకు సిద్ధమవుతోన్న తరుణంలోనే నకిలీ విత్తనాలు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. మే నెల చివరివారంలో రంగారెడ్డి జిల్లాలో నాలుగు చోట్ల మొత్తం రూ.57.48 లక్షల నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడ్డాయి. వీటిలో మే 27న షాద్‌నగర్‌లో రూ. 3 లక్షలు విలువ కలిగిన విత్తనాలు పట్టుబడగా, 28వ తేదీన కందుకూరు మండల కేంద్రంలో రూ.32 లక్షలు విలువ కలిగిన నకిలీ విత్తనాల లారీని పోలీసులు పట్టుకున్నారు. అలాగే అబ్దుల్లాపూర్‌మెట్‌లో రూ.22 లక్షలు, అదేరోజు అదే ప్రాంతంలోని ఆటోనగర్‌లో రూ.48 వేల నకిలీ కంది విత్తనాలు పట్టుబడ్డాయి. జూన్‌ 3వ తేదీన మేడ్చల్‌ జిల్లాలో కండ్లకోయ వద్ద సీడ్స్‌ గోదాంపై విజిలెన్స్‌ అధికారులు దాడులు నిర్వహించి రూ.31 లక్షల విలువైన నకిలీ విత్తనాలను పట్టుకున్నారు. వీటితో పాటు పొద్దుతిరుగుడు, మొక్కజొన్న, జొన్నవిత్తనాలను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ విత్తనాలతో రైతులు ప్రతి ఏడాదీ నష్టపోతున్నా దానిని అరికట్టడంలో ప్రభుత్వం సరైన శ్రద్ధ చూపడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

You might also like