FbTelugu

ఫేస్‌బుక్‌ లో ఫేక్ మెస్సేజీలు… యాడ్స్ నిలిపేసిన కంపెనీలు

ఒక్కరోజే రూ. 53 వేల కోట్ల సంపద ఆవిరి

తప్పులు సరిచేస్తామన్న జుకర్‌బర్గ్‌

సోషల్ మీడియా ఫేస్‌బుక్‌కు ప్రపంచ దిగ్గజ కంపెనీలు భారీ షాక్ ఇచ్చాయి. వివాదాస్పద మెస్సేజీలు, ఫేక్ మెస్సేజీలను నిలువరించడంతో వైఫల్యం చెందడంతో అడ్వర్టైజ్ మెంట్లను నిలిపివేశాయి.
వివాదాస్పద, సున్నితమైన వార్తలను కట్టడి చేయాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. అనేకసార్లు కంపెనీలతో పాటు పలువురు ఫిర్యాదు చేసినప్పటికీ ఫేస్‌బుక్‌ యాజమాన్యం పెడచెవిన పెడుతోంది. స్పందించట్లేదని నిర్ణయించుకున్న యూనిలీవర్‌, వెరిజాన్‌, కోకకోలా, హోండా మోటార్‌, హెర్షీ కో వంటి కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ఫేస్‌బుక్‌కు అతి భారీగా నష్టం వాటిల్లడం మొదలైంది.
నెల రోజుల పాటు ప్రకటనలు ఇవ్వడం నిలిపేస్తున్నట్లు‌ ఇప్పటికే కోకకోలా ప్రకటించింది. యూనిలీవర్‌, వెరిజాన్, మోటార్‌, హెర్షీ కో కంపెనీలు కూడా అదే నిర్ణయం వెలువరించాయి. ఈ కంపెనీల బాటలో పలు సంస్థలు కూడా ఇదే నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉన్నాయి.
విద్వేష పూరిత వీడియోలు, మెస్సేజీలను ఫేస్‌బుక్‌ సరిగ్గా కట్టడి చేయట్లేదని తీవ్ర ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. అమెరికాలో ఇటీవలి కాలంలో విమర్శలు అధికమయ్యాయి. పలు కంపెనీలు ప్రకటనలు నిలిపివేయడంతో ఫేస్‌బుక్ షేరు నిన్న ఒక్కసారిగా 8.5 శాతం పడిపోయింది. ఫలితంగా రూ. 53 వేల కోట్లు సంపద ఒక్క రోజులోనే ఆవిరికావడం యాజమాన్యాన్ని కలవరానికి గురి చేసింది.
అమెరికాలోని డిజిటల్‌ ప్రకటనల మార్కెట్‌లో ఫేస్‌బుక్ సంస్థ అగ్రగ్రామిగా ఉంది. ఒక్క అమెరికాలోనే దాదాపు 23 శాతం వాటా ఉండగా మూడు బిలియన్ల మంది యూజర్లు ఉన్నారు. గత ఏడాది ఆ సంస్థ డిజిటల్‌ యాడ్స్‌ ఆదాయం 27 శాతం పెరిగి సుమారు 70 బిలియన్‌ డాలర్లకు చేరిన విషయం తెలిసిందే.

యాడ్స్ నిలిపేయడంతో గడ్డు పరిస్థితులు ఎదురవుతాయని భావించిన ఫేస్‌బుక్‌ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ దిద్దుబాటు చర్యలు తీసుకున్నారు. ఫేక్ న్యూస్ పై స్పందిస్తూ, అన్ని రకాల ఓటింగ్ సంబంధిత పోస్టులకు కొత్త ఓటరు సమాచారం అనే లింకును జోడిస్తామని ప్రకటించారు. ఇకనుంచి విద్వేషపూరిత వ్యాఖ్యలపై మరింత కఠినంగా వ్యవహరించనున్నామని తెలిపారు. రాజకీయ నాయకులు కూడా వీటి నుంచి తప్పించుకోలేరని జుకర్‌బర్గ్ స్పష్టం చేశారు.

You might also like