కరోనా నియంత్రణకు విధించిన నాలుగో విడత లాక్డౌన్ ఈ నెల 31న అంటే మరో మూడు రోజుల్లో ముగియనుంది. ఇప్పటికే నాలుగుసార్లు లాక్డౌన్ కాలాన్ని పొడిగించారు.
తాజాగా మరోసారి జూన్ 14వరకు పొడిగించే అవకాశముందని, ఆదివారం ప్రధాని మన్‌కీబాత్‌లో ఈ విషయాన్ని వెల్లడిస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే, కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా లాక్డౌన్ కాలాన్ని పొడిగించిన ప్రతిసారీ కొన్ని రంగాలకు వాటినుంచి వెసులుబాటు ఇస్తూ నిర్ణయాలు తీసుకున్నాయి. మద్యం దుకాణాలు మొదలు ప్రజా రవాణ రంగం వరకు అన్నీ పూర్తిస్థాయిలో నడుస్తున్నాయి. అంతర్జాతీయ విమానాలు, రైళ్లు, సిటీ బస్సులు మినహా మిగతా అన్ని రంగాలు పూర్తిస్థాయిలోనే పనిచేస్తున్నాయి. దీంతో జనం ఒక్కసారిగా రోడ్లమీదకు రావడంతో పాజిటివ్ కేసుల సంఖ్య దారుణంగా పెరుగుతోంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి రోజూ వందకు మించి కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా భారీగానే పెరుగుతోంది. లాక్డౌన్ విధించిన ప్రారంభంలో అన్నిరంగాలు మూతపడిన కాలంలో రోజుకు పదికి మించి కేసులు నమోదు కాలేదు. తెలంగాణలో అయితే, జీహెచ్ఎంసీ పరిధిలో తప్ప జిల్లాల్లో ఎక్కడా కొత్త కేసులు రాలేదు. ఇలాంటి పరిస్థితి నుంచి లాక్డౌన్ సడలింపు తర్వాత పాజిటివ్‌ల సంఖ్య భారీగా పెరిగింది. ఆర్టీసీ బస్సులు తిరగడంతో అప్పటివరకు పల్లెలకు సోకని ఈ మహమ్మారి పల్లె ప్రాంతాలకు కూడా సోకి అతలాకుతలం చేసింది. ఇప్పుడు పల్లె, పట్నం అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాలను ఈ వైరస్ వణికిస్తోంది.
ఇలాంటి పరిస్థితిలో లాక్డౌన్ కాలాన్ని పెంచినా పెద్ద ఉపయోగం ఏం ఉంటుందన్న చర్చ జోరుగా సాగుతోంది. అన్నింటికీ సడలింపు ఇచ్చిన తర్వాత ప్రస్తుతం లాక్డౌన్ ఉన్నట్టుగానే లేదని, సాధారణ రోజుల్లో ఉన్నట్టే ఉందని, అలాంటప్పుడు లాక్డౌన్ కాలం పొడిగించినా పెద్ద ప్రయోజనం ఏమీ ఉండదన్న చర్చ జోరుగా సాగుతోంది. ఒకవేళ ప్రభుత్వాలకు నిజంగా కరోనాపై విజయం సాధించాలన్న ఆలోచన ఉంటే లాక్‌డౌన్‌ను మొదట్లో విధించినట్టుగానే చూడాలని, మళ్లీ రోడ్లమీదకు జనం రాకుండా చేస్తేనే దానికి ప్రతిఫలం ఉంటుందని, లేకుంటే లాక్డౌన్ ఉన్నా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గడం మాత్రం జరగదని జనం అభిప్రాయపడుతున్నారు. అయితే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయో చూడాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే మరి.