FbTelugu

ప్రైవేటు ఆసుపత్రుల దోపిడి: మంత్రి ఈటల

హైదరాబాద్: ప్రైవేటు ఆసుపత్రిలో కరోనా చికిత్సకు ధరలు నిర్ణయించినప్పటికీ మందుల పేరుతో, పీపీఈ కిట్ల పేరుతో, ఐసీయూ చార్జీలు, వైద్య సిబ్బందికి అధిక జీతాల పేరుతో అడ్డగోలుగా వసూలు చేయడం తగదని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.
ఇవాళ ప్రైవేట్ ఆసుపత్రులపై వస్తున్న ఫిర్యాదులపై అధికారులతో మంత్రి రాజేందర్ విస్తృతంగా సమీక్ష నిర్వహించారు. వైద్యం అందించాల్సిన బాధ్యత మర్చిపోయి ప్రైవేట్ ఆసుపత్రులు లాభాల కోసం మానవతా ధృక్పదం లేకుండా ప్రవర్తిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల భయాన్ని సొమ్ము చేసుకోవడం తగదని అన్నారు.

సాధారణ రోజులతో పోల్చితే ఇప్పుడు పది రేట్లు ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ కి ఫిర్యాదులు వస్తున్నాయని అధికారులు మంత్రికి వివరించారు. దీనిపై ఉన్నతాధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఫిర్యాదులపై విచారణ జరిపించాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం ఫీజులు అమలు జరిగేలా చర్యలు తీసుకోవటం , బెడ్స్ ఖాళీలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదిక అందించేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు.
బెడ్స్ లేవని కృత్రిమ కొరత సృష్టించి ప్రజల నుంచి ఎక్కువ డబ్బులు డిమాండ్ చేయడం కుదరని రాజేందర్ స్పష్టం చేశారు. కనీసం రూ.3 నుంచి రూ. 4 లక్షలు అడ్వాన్స్ లేనిదే చేర్చుకొక పోవడం… ఒక్క రోజుకు రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల వరకు బిల్లులు వసూలు చేయడం సరికాదన్నారు. రోగి మృతి చెందిన తరువాత కూడా మానవతా దృక్పథం లేకుండా చార్జీలు చెల్లిస్తే తప్ప మృతదేహం కుటుంబ సభ్యులకు అప్పగించటం లేదని మంత్రి మండిపడ్డారు.

ఏ మాత్రం కూడా లక్షణాలు లేని వారిని కూడా అడ్మిట్ చేసుకుని విపరీతంగా చార్జీలు వసూలు చేయడం దారుణమన్నారు. రోగి సీరియస్ కాగానే అంబులెన్స్ లో పడేసి ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తున్నారు అంటూ వచ్చిన ఫిర్యాదులపై మంత్రి రాజేందర్ సమీక్షించారు. ప్రజలు కరోనా గురించి భయపడకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి ఉచితంగా వైద్యం చేయించుకోవాలని మంత్రి కోరారు.

You might also like