FbTelugu

దారికొస్తాయా..?

తెలంగాణలో కరోనా విశ్వరూపం చూపుతోంది. ఇదు అదునుగా చికిత్స కోసం వెళితే ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీ తీవ్రరూపం దాలుస్తోంది. రోజుకు లక్ష నుంచి రెండు లక్షల దాకా బిల్లులు వేస్తున్నారు. కనీసం కరోనా బాధితుడు చనిపోయినా ఆసుపత్రి బిల్లు చెల్లించిన తర్వాతే ఆ విషయం చెబుతున్నారు. బిల్లు మొత్తం చెల్లించి మృతదేహాన్ని తీసుకెళ్లాలని కండీషన్‌ పెడుతున్నారు. దీంతో బాధితులు నానా ఇబ్బందులు పడుతున్నారు. అసలు బాధితులను చేర్చుకునేటప్పుడే ముందుగా కనీసం ఐదు లక్షలు డిపాజిట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు హైదరాబాద్‌లో అనేకం వెలుగులోకి వచ్చాయి. నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో భార్యను కరోనా చికిత్సకోసం చేర్పించిన భర్త ఆసుపత్రి బిల్లు చూసి గుండె ఆగి మరణించిన సంఘటన కూడా వెలుగులోకి వచ్చింది.

ఇంతకీ అంత బిల్లు వేశారంటే.. ఆ బాధితురాలు బతికి ఉండవచ్చని అనుకుంటున్నారు కదా.. కానీ, ఆమె మరణించింది. 12లక్షల దాకా బిల్లువేసిన ఆసుపత్రి ఆ బిల్లు చెల్లించిన తర్వాతే మృతదేహాన్ని తీసుకెళ్లాలని షరతు పెట్టింది. ఇలా ఈ ఆసుపత్రిపై అనేక ఆరోపణలు వచ్చాయి. చివరకు.. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుండడంతో ప్రభుత్వం స్పందించింది. ఇలా అధిక బిల్లులు వేసిన దక్కన్, విరించి ఆసుపత్రులపై చర్యలు తీసుకుంది. వాటిని కరోనా చికిత్స ఆసుపత్రుల నుంచి తప్పించారు. అయితే, లేటుగా స్పందించినా ప్రభుత్వం మిగతా ఆసుపత్రుల మీద కూడా చర్యలు తీసుకుంటుందా.. లేక వాటిని అలాగే వదిలేస్తుందా అన్న చర్చ ఇప్పుడు తీవ్రంగా నడుస్తోంది. రెండు ఆస్పత్రులపై చర్యలు తీసుకున్నందున మిగతా ఆసుపత్రులు దారికొస్తాయా.. లేక తమ దోపిడీని అలాగే కొనసాగిస్తాయా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విలేకరులతో మాట్లాడుతూ కరోనా చికిత్సకు కేవలం పదివేల రూపాయలు కూడా ఖర్చు కావని చెప్పారు. అలాంటప్పుడు ఇన్ని లక్షలు ఎందుకు వసూలు చేస్తున్నారు?. ప్రైవేటు ఆసుపత్రులు కరోనా చికిత్సకు ఎంత వసూలు చేయాలో ప్రభుత్వం ఒక జాబితాను విడుదల చేసింది. కానీ, ఏ ప్రైవేటు ఆసుపత్రి కూడా వాటిని పాటించడం లేదు. మరి వాటన్నింటిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే, ప్రస్తుతం ప్రైవేటు ఆసుపత్రులకు కూడా ప్రధాన వనరు కరోనా కేసులే. మిగతా రోగులెవరూ ఆసుపత్రులకు రావడం లేదు. దీంతో కరోనా బాధితుల నుంచి తప్ప ఆదాయం వచ్చే మార్గం లేకుండా పోయింది. ఈ పరిస్థితుల్లో బిల్లులు అధికంగా వేసి కరోనా చికిత్స చేసే అవకాశాన్ని కోల్పోయేందుకు ప్రైవేటు ఆసుపత్రులు సిద్ధమవుతాయా.. వాటిద్వారా వచ్చే ఆదాయాన్ని కోల్పోయేందుకు ఒప్పుకుంటాయా లేక కరోనా బాధితులకు బిల్లులు తక్కువ వేసి కరోనా చికిత్స జాబితాలో తమ స్థానాన్ని నిలుపుకుంటాయా.. మొత్తంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ప్రైవేటు ఆసుపత్రులు దారికొస్తాయా అన్న చర్చ తెలంగాణ వాసుల్లో జోరుగా సాగుతోంది.

You might also like