FbTelugu

రాజధాని కోసం చేసిన ఖర్చెంత? : హైకోర్టు

అమరావతి: ఏపీ రాజధాని నగరం అమరావతిలో ఇప్పటి వరకు రూ.52వేల కోట్లు ఖర్చు చేసినట్లు క్యాపిటల్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ (సీఆర్డీఏ) హైకోర్టుకు తెలియచేసింది.
ఇవాళ రాజధాని పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరగ్గా, పిటీషన్‌‌లపై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెప్పడంతో హైకోర్టు ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. నేటివరకు ఎంత ఖర్చు చేశారు? ఎక్కడ ఆ నిర్మాణం ఆగింది? తదితర వివరాలు హైకోర్టు ఆదేశించింది. ఇది ప్రజల సొమ్ము.. రాష్ట్ర ఖజానాకు నష్టమే కదా అని వ్యాఖ్యానించింది. అసలు బిల్డింగ్‌లు ఎన్ని పూర్తయ్యాయి..? ఎక్కడ ఆగిపోయాయి…? ఎంత వ్యవయం చేశారు..? కాంట్రాక్టర్లకు ఎంత డబ్బులివ్వాలి..? వంటి వివరాలన్నీ వెంటనే సమర్పించాలని ఆదేశించింది.

నిర్మించిన భవనాలను వాడుకోకపోతే, అవి పాడైపోతాయి కదా.. ఆ నష్టం ఎవరు భరిస్తారని ప్రశ్నించింది. అకౌంటెంట్ జనరల్‌ (ఏజీ)కు వెంటనే నోటీసులు ఇవ్వాలని ఆదేశించిన హైకోర్టు, ఈ డబ్బులు ఎక్కడ నుంచి తీసుకువచ్చారు? అని ప్రశ్నించింది. రూ.52 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు ఏ దశలో ఉన్నాయో కూడా వివరాలు ఇవ్వాలని ఆదేశించిన ధర్మాసనం, తదుపరి విచారణను ఈ నెల 14వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

You might also like