FbTelugu

జీతాల కోసం ఏపీ ఉద్యోగులు ఎదురుచూపులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కొత్త నెల వచ్చి మూడు రోజులు గడిచిపోయినా ఇప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పడలేదు. నెలలో చివరి పని దినం రోజున జీతాలు జమ చేయాలి కాని చేయలేదు.

దిగజారిన ఆర్థిక పరిస్థితి కారణంగా ఈసారి ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల చెల్లింపులు 8వ తేదీ నుంచి మాత్రమే జరుగుతాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం… ఉద్యోగుల జీతాలా? సంక్షేమ పథకాలా? ఏది ముఖ్యం అని ప్రశ్నించుకుని, ప్రాధాన్యాలు నిర్ణయించుకోవాల్సి వస్తోంది. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తే వేతనాలు ఇవ్వలేరు. జీతాలు ఇస్తే పథకాలు అమలు చేయలేరు. ఇదీ సంగతి.

అందుకే… జీతాల చెల్లింపుల కోసం ‘జగనన్న విద్యా దీవెన’ పథకాన్ని వాయిదా వేసుకోవాల్సి వచ్చిందని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. రెండింటికీ ఒకేసారి నిధులు సర్దుబాటు చేయడం ఖజానాకు తలకు మించిన భారమవుతోంది. గత రెండు మూడు దశాబ్ధాలుగా ఏపితో పాటు తమిళనాడు రాష్ట్రాల్లో ఇబ్బడిముబ్బడిగా సంక్షేమ, ప్రజాకర్షక పథకాలు ప్రకటించి రాష్ట్ర ఖజానాను దివాలా తీయించే పరిస్థితి తీసుకువచ్చారు. కేవలం అధికారం కోసం ఇష్టమొచ్చినట్లుగా సంక్షేమ పథకాలు ప్రకటించి ఓట్లు దండుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తరువాత రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆర్థిక పరిస్థితి పేనం మీద నుంచి పొయ్యిలో పడిన చందంగా ఉంది. అధికారం కాపాడుకునేందుకు, అధికారం దక్కించుకునేందుకు అనేక పథకాలు ప్రకటించి ఖజానా ను ఖాళీ చేశారు. ప్రతి నెలా అప్పులకు వెళ్తే తప్ప జీతాలు లేదా పథకాలు అమలు చేసే దుస్థితి కల్పించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.