FbTelugu

కంటైన్మెంట్ మినహా సడలింపులు: కేసీఆర్

సాధారణ కార్యకలాపాలకు పచ్చజెండా

ఈ కామర్స్ కు గ్రీన్ సిగ్నల్

మాస్కు లేకుంటే రూ.1 వెయ్యి జరిమానా

హైదరాబాద్ లో మెట్రో రైలు, ఆర్టీసీ బస్సుల కు అనుమతి లేదు

హైదరాబాద్: కంటైన్మెంట్ ప్రాంతం మినహా మిగతా ప్రాంతాల్లో అన్ని రకాల కార్యకలాపాలకు అనుమతిస్తున్నామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.

ఈ జోన్లలో ఉన్న ప్రజలకు సరకులను ప్రభుత్వమే సరఫరా చేస్తుందని, ఏ విధమైన కార్యకలాపాలను నిర్వహించవద్దని సీఎం స్పష్టం చేశారు. క్యాబినెట్ సమావేశం ముగిసిన తరువాత సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ నెలాఖరు వరకు ప్రార్థనా స్థలాలు, సినిమా హాళ్లు, సభలు, సమావేశాలు, ర్యాలీలు, విద్యా సంస్థలు, మాల్స్, కోచింగ్ సెంటర్లు తెరిచేందుకు అనుమతి లేదన్నారు. పార్కులు, పబ్బులు, బార్లు, స్విమ్మింగ్ ఫూల్స్ కూడా ఇదే నిబంధన వర్తిస్తుందన్నారు.

అవసరం ఉన్నవారు మాత్రమే రోడ్ల మీదకు రావాలని, అనవసరంగా వస్తే కరోనా వైరస్ తిరగబెడుతుందని, మళ్లీ పూర్తి లాక్ డౌన్ కు వెళ్లే దుస్థితి ఉందని హెచ్చరించారు. ఇప్పటి వరకు ప్రజలు లాక్ డౌన్ కు సహకరించారని కేసీఆర్ తెలిపారు.

రాష్ట్రంలో మంగళవారం ఉదయం 6 గంటల నుంచే బస్సులు నడుస్తాయని, ఆటోలు, టాక్సీలను కూడా అనుమతిస్తున్నామని అన్నారు అయితే హైదరాబాద్లో మెట్రో రైళ్లు, ఆర్టీసీ బస్సులు నడవవు అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. పరిశ్రమలు కూడా తెరుచుకుని పనులు మొదలు పెట్టవచ్చన్నారు. ఈ కామర్స్ సంస్థలను అనుమతించారు. గతంలో మాదిరి కొనుగోలు చేసి సరకులు, ఫూడ్ తెప్పించుకోవచ్చన్నారు. హైదరాబాద్ లో కేసుల తీవ్రత ఉన్నందున సరి బేసి సంఖ్యలో దుకాణాలు తెరచుకోవచ్చన్నారు. సెలూన్లకు కూడా అనుమతించామన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు వంద శాతం సిబ్బందితో మంగళవారం నుంచి పనిచేస్తాయన్నారు. ప్రతి ఒక్కరు భౌతిక దూరం (ఫిజికల్ డిస్టాన్స్) పాటించాలని, మాస్క్ లేకపోతే రూ.1000 జరిమానా విధిస్తారన్నారు.

You might also like