FbTelugu

చంద్రబాబు పీఎస్ అక్రమాస్తుల గుట్టురట్టు

ఐటీ దాడుల్లో రూ.2 వేల కోట్ల అక్రమాస్తులు గుర్తింపు

సోదాలపై వివరాలు ప్రకటించిన ఐటీ శాఖ

హైదరాబాద్: ఇటీవల ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఐటీ శాఖ పెద్ద ఎత్తున దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో సుమారు రూ.2 వేల కోట్ల ఆక్రమాస్తులు బయటపడ్డాయని ఐటీ శాఖ వివరాలు వెల్లడించింది. ఆర్వీఆర్ ఇన్ ఫ్రా, ఆర్ కె కంపెనీలు పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడ్డాయి. హైదరాబాద్, విజయవాడ, కడప, విశాఖపట్టణంతో పాటు పలు ప్రాంతాలలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. మొత్తం ఐదు ప్రాంతాల్లో 40 చోట్ల దాడులు జరిగాయి. మూడు ప్రముఖ ఇన్ ఫ్రా కంపెనీలలో కూడా సోదాలు నిర్వహించగా ఆశ్చర్యకరంగా అక్రమాస్తుల గుట్టు వెలుగులోకి వచ్చింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్ద పనిస్తున్న ప్రైవేటు సెక్రెటరీ శ్రీనివాస్ నివాసం,  బంధువుల ఇళ్లల్లో కూడా ఐదు రోజుల పాటు ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈయన వద్ద పలు కీలక సాక్ష్యాలు లభ్యమయ్యాయి.

ఇన్ ఫ్రా కంపెనీలలో దాడులు నిర్వహించగా, బోగస్ కంపెనీలతో వేల కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడినట్లు బట్టబయలు అయింది. రూ.2 కోట్ల టర్నోవర్ దాటని కంపెనీల్లో రూ.2వేల కోట్లు దారి మళ్ళించినట్లు చూపించారు. బోగస్ బిల్లులు, బోగస్ కాంట్రాక్టర్లు, బోగస్ సబ్ కాంట్రాక్టర్ల బిల్లులు బయటపడ్డం అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది. 25 బ్యాంకు లాకర్లను తెరిచి రూ.85 లక్షల నగదు, రూ.71 లక్షల విలువైన ఆభరణాలు సీజ్ చేశారు. ఈ మెయిల్, వాట్సప్ ద్వారా విదేశాల్లో చేసిన లావాదేవీలను సైతం గుర్తించారు. ఒక కంపెనీ ఎఫ్ డి ఐ పేరుతో మోసం చేసే ప్రయత్నం చేసింది. పలు షెల్ కంపెనీలకు నిధులు వెళ్లాయి.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More