FbTelugu

ప్రతి మృతదేహం పరీక్షించాల్సిందే: హైకోర్టు

హైదరాబాద్: రాష్ట్రంలో ఇకనుంచి చనిపోయేవారి దేహాలకు కరోనా పాజిటివ్ టెస్టులు చేయాల్సిందేనని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

ఉస్మానియా ప్రొఫెసర్ పీఎల్.విశ్వేశ్వర్ రావు, అడ్వకేట్ చిక్కుడు ప్రభాకర్ లు దాఖలు చేసిన పిటీషన్లపై హైకోర్టు ఈ తీర్పునిచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 26 కు వాయిదా వేసింది. రాష్ట్రంలో ఇటీవలి కాలంలో చనిపోయిన వారి మృతదేహాలకు వైద్య పరీక్షలు నిర్వహించడం లేదని విశ్వేశ్వర్ రావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. ప్రభుత్వం నిర్ణయం కారణంగా కరోనా మరింత విజృంభించే ప్రమాదముందని, మూడో స్టేజీకి వెళ్తే ఎవరూ కాపాడలేరని హైకోర్టుకు విన్నవించారు.

వాదనలు విన్న హైకోర్టు చనిపోయిన వారి దేహాలను పరీక్షించే విషయంలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం ప్రతి మృతదేహాన్ని కూడా పరీక్షించాల్సిందేనని స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశం కారణంగా ఇకనుంచి రాష్ట్రంలో ఎవరు చనిపోయినా ఆ దేహం నుంచి నమూనాలు సేకరించి పరీక్షించనున్నారు.

You might also like