FbTelugu

ఉద్యోగులు జగన్ బాకా ఆపాలి: ఎమ్మెల్సీ అశోక్

అమరావతి: ఉద్యోగ సంఘాలు సీఎం జగన్ రెడ్డికి బాకా ఊదడం మానుకోవాలని ఎమ్మెల్సీ అశోక్ బాబు హితవు పలికారు. ఇంతకాలం కరోనా ప్రొటోకాల్ పాటించకుండా ఇప్పుడు కరోనా ఉందంటే ఎలా? అని ఆయన ప్రశ్నించారు.

శనివారం తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… గతంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై అఖిల పక్ష పార్టీ సమావేశం పెట్టిందన్నారు. ఈ సమావేశానికి వైసీపీ హాజరుకాలేదని, అన్ని పార్టీలు హాజరయ్యాయన్నారు. హాజరుకాని సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను అమలుపరచాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అశోక్ బాబు అన్నారు.

ఆ రోజు వైసీపీ సమావేశానికి హాజరై పరిస్థితులను వివరించి ఉంటే మరోలా ఉండేదేమోనన్నారు. వైసీపీ అహంకారంతో వ్యవహరించడం భావ్యంకాదన్నారు. 150 సీట్లు వచ్చాయని, మేం ఏం చేసినా చెల్లుతుందనుకోవడం వారి అహంకారానికి నిదర్శనమన్నారు. వైసీపీ నాయకులు రాష్టానికేదో అన్యాయం జరిగిపోతున్నట్లుగా తెగ బాధపడిపోతున్నారు. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చాక ఫుల్ షేప్ లో ఉన్న ఎన్నికలని మళ్ళీ పూర్తిస్థాయిలో నిర్వహించాలని నేడు ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో కరోనా ఉంది, ఎన్నికలు వద్దని ఇప్పుడు చెబుతున్నారేగానీ, గతంలో కరోనా ప్రొటోకాల్ ని పాటించలేదని అశోక్ బాబు గుర్తు చేశారు.

ఉదాహరణకు విజయవాడలో ఆలయాల పునర్నిర్మణం పేరుతో శంఖుస్థాపన చేసిన చోట ఎక్కడా కరోనా ప్రొటోకాల్ పాటించలేదు. సీఎం జగన్ మాస్క్ లేకుండా పాల్గొన్నారన్నారు.  నచ్చితే ఓకే, నచ్చకపోతే కోర్టులు అంటారన్నారు. కరోనా ఉంది, ప్రస్తుతం ఎన్నికలు వద్దని ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి. ఉద్యోగస్థులకు రావాల్సిన డీఆర్, పీఆర్సీల గురించి మాట్లాడాలేగానీ, ఎన్నికలు వద్దని మాట్లాడడం భావ్యం కాదన్నారు. ఉద్యోగ సంఘాలు ఉద్యోగుల సంక్షేమం గురించి మాట్లాడాలని ఆయన సూచించారు. తిరుపతి ఉప ఎన్నికలను వాయిదా వేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ను అడగలేరు కాని పంచాయతీ ఎన్నికలు వాయిదా వేయాలని రచ్చ చేస్తున్నారని అశోక్ బాబు మండిపడ్డారు.

రాష్ట్రంలో విందులు, సంబరాలు, ఉత్సవాలు చేసుకునేటప్పుడు గుర్తుకు రాని కరోనా ఎన్నికలనగానే గుర్తుకొచ్చిందా? అని ఆయన నిలదీశారు. గ్రామాల సౌభాగ్యాన్ని కోరుకొని రాజ్యాంగాన్ని పరిరక్షిస్తూ ఎన్నికలు జరపాల్సిందేనని అశోక్ బాబు స్పష్టం చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.