FbTelugu

గెలుపెవరిదో..!

ఇప్పుడు గెలవబోయేది పచ్చనోటా.. సమస్యల పరిష్కారం కోసం ఆయుధంగా వాడుకునే ఓటా.. ఇదే చర్చ తెలంగాణ వ్యాప్తంగా జోరుగా సాగుతోంది. ఆదివారం తెలంగాణ రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో విజయమెవరిది అన్న ఉత్కంఠ నెలకొంది. ఈ ఎన్నికలను అధికార పార్టీతో పాటు విపక్ష బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. నాయకులంతా కాలికి బలపం కట్టుకొని గడప గడపకూ తిరిగారు. అధికార పార్టీ మరో అడుగు ముందుకేసింది. ఆత్మీయ సమావేశాల పేరుతో ఓటర్లకు మందు, విందులను ఏర్పాటు చేసింది. అంతటితో ఆగకుండా ఒక్కో ఓటుకు రెండువేల రూపాయల నుంచి ఐదువేల దాకా పంచింది. ఇందుకు గాను ప్రతి గ్రామంలో ఓ ఇన్‌చార్జిని నియమించింది. పెద్ద ఎత్తున డబ్బుల పంపకాన్ని చేపట్టినట్టు ప్రచారం సాగింది. కొన్ని ప్రాంతాల్లో ఓ ఇంట్లో కూర్చొని ఓటరు జాబితాను చూసుకుంటూ ఓటర్లకు డబ్బులు పంచుతున్నట్టు వీడియోలు కూడా సోషల్‌ మీడియాలో వచ్చాయి. అయితే, మిగతా పార్టీలు కేవలం ప్రచారాలకు పరిమితమయ్యాయి తప్ప ఎక్కడా డబ్బులు పంచిన దాఖలాలు కనిపించలేదు.

దీనికితోడు ఎప్పుడూ లేనంతగా ఈసారి ఓటరు నమోదు శాతం భారీగా పెరిగింది. దీంతో ఇప్పుడు ఆ ఓటర్లంతా ఎవరికి ఓటు వేశారన్న చర్చ సాగుతోంది. వాస్తవానికి ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కరించడం లేదన్న కోపంతో రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నారు. ప్రధానంగా పీఆర్‌సీ, ఫిట్‌మెంట్‌ లాంటివాటిని ప్రకటించకపోవడంతో కొన్నాళ్లుగా ఆందోళనలకు కూడా దిగారు. ఇక, ఉద్యోగాల భర్తీని చేపట్టడం లేదని నిరుద్యోగులు కూడా ఆగ్రహంతో ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఓటర్లంతా వీరే. కాబట్టి ఉద్యోగులు, నిరుద్యోగులు ప్రభుత్వంపై ఆగ్రహంతోనే ఉన్నారు. కానీ, ఈ ఎన్నికలకు ముందు డబ్బుల పంపకం చేపట్టిన తర్వాత పరిస్థితి ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అయితే, విజ్ఞత కలిగిన పట్టభద్రులు కూడా డబ్బులకు ఆశపడి ఓటేస్తారా అన్న అనుమానాలు కూడా ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. ఓటింగ్‌ శాతం పెరగడం వల్ల ఎవరికి నష్టం.. ఎవరికి లాభం అన్న చర్చ కూడా సాగుతోంది. ఇప్పుడు పట్టభద్రులు నోటుకు ఓటేశారా.. లేక ఓటుహక్కును వాడుకొని తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి ఓటేశారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సమాధానం దొరకాలంటే కౌంటింగ్‌ పూర్తయ్యి ఫలితం వెలువడే వరకూ ఆగాల్సిందే.

You might also like

Leave A Reply

Your email address will not be published.