FbTelugu

ఆ ఎమ్మెల్సీలు ఎక్కడ..!

ఇటీవల తెలంగాణలోని రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ రెండింటిలోనూ అధికార టీఆర్‌ఎస్‌ అభ్యర్థులే విజయం సాధించారు. నల్లగొండ–ఖమ్మం–వరంగల్‌ స్థానం నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి రెండోసారి విజయం సాధించారు. ఇక హైదరాబాద్‌–రంగారెడ్డి–మహబూబ్‌నగర్‌ స్థానం నుంచి కూడా అధికార అభ్యర్థి, మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కూతురు వాణీదేవి విజయం సాధించారు. ఎన్నికల సమయంలో అన్ని పార్టీల అభ్యర్థులు తమను గెలిపిస్తే నిత్యం ప్రజల్లో ఉంటామని, వారి కష్టాలను పరిష్కరిస్తామని.. ప్రజల సమస్యలపై పనిచేస్తామని ఊదరగొట్టారు. ఎన్నికలు ముగిశాయి. రెండుచోట్లా టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు విజయం సాధించారు. వారు విజయం సాధించి కూడా దాదాపు రెండు నెలలు కావస్తోంది. కానీ, గెలిచిన ఆ ఇద్దరు ఎమ్మెల్సీలు ఇంతవరకు ఎక్కడా కనిపించడం లేదు.

పల్లా రాజేశ్వర్‌రెడ్డి నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నోముల భగత్‌కు అనుకూలంగా ప్రచారంలో కనిపించారు. ఆ ఎన్నికలు అయిన నాటినుంచి మళ్లీ బయటకు రాలేదు. ప్రస్తుతం కరోనా రెండో దశ విజృంభిస్తోంది. నిరుద్యోగులు ఆర్థికంగా చితికిపోయారు. ప్రైవేటు ఉద్యోగాలన్నీ పోయాయి. నిరుద్యోగం పెరిగింది. దీనికితోడు వారంతా ఇప్పుడు కొవిడ్‌ బారిన పడుతున్నారు. ఉద్యోగాలు పోయి అనేకమంది ప్రైవేటు ఉపాధ్యాయులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇంత జరుగుతున్నా ఆ ఇద్దరు ఎమ్మెల్సీలు ఎక్కడా బయటకు రావడం లేదు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని.. విపక్షాల మాటలు నమ్మి మోసపోవద్దని ఉపాన్యాసాలిచ్చిన ఆ ఇద్దరు ఎమ్మెల్సీలు కనీసం ఆత్మహత్య చేసుకున్న ప్రైవేటు ఉపాధ్యాయుల కుటుంబాలను కలిసి ఓదార్చడానికి కూడా బయటకు రావడం లేదు. కనీసం వారికి సంతాపం ప్రకటించే తీరిక కూడా లేకుండా పోయింది వారికి అన్న విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. కరోనా విజృంభిస్తుండడంతో తమకు ఈ మహమ్మారి ఎక్కడ అంటుకుంటుందో అన్న భయంతో వారు బయటకు రాకుండా ఇంట్లోనే ఉంటున్నారని ఆ పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు. మరి వారి ప్రాణాలను కాపాడుకుంటున్న వారికి ప్రజల ప్రాణాలు పట్టవా అని విపక్షాలు విమర్శిస్తున్నాయి. నాయకులు, ప్రజా ప్రతినిధులంటే ప్రజలు ఇలా కష్టాలు పడుతున్నప్పుడే కదా వారి వెన్నంటి ఉండి వారికి ధైర్యాన్సివ్వాల్సింది అన్న చర్చ జోరుగా సాగుతోంది. కరోనాతో అంతా అతలాకుతలం అవుతున్న తరుణంలో ఇక మనం గెలిచాము కదా.. ప్రజలు ఎక్కడ చస్తే మాకెందుకులే అన్న చందంగా వ్యవహరించడం దుర్మార్గమని విపక్షాలు విమర్శలకు దిగుతున్నాయి. మరి ఆ ఇద్దరు ఎమ్మెల్సీలు ఎక్కడ ఉన్నారో.. ఏం చేస్తున్నారో గానీ మొత్తానికి ఎన్నికల్లో ప్రజలకు, యువతకు ఇచ్చిన హామీలతో పాటు తమను కూడా గాలికొదిలేశారన్న విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. ఓ ప్రజాప్రతినిధులారా ఇప్పటికైనా జనంలోకి వచ్చి కష్టకాలంలో ఆపన్నహస్తం అందించి తమకు ధైర్యాన్ని అందించాలని ప్రజలు కోరుకుంటున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.