FbTelugu

డిటీపీ ఆపరేటర్… వంద కోట్లకు పడగలెత్తాడు

హైదరాబాద్: ఒక అనామక కంప్యూటర్ ఆపరేటర్ అంచెలంచెలుగా ఎదిగి తహశీల్దార్ స్థాయి వరకు చేరుకున్నాడు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగం నుంచి తహశీల్దార్ గా మారిన ఆయన వందల కోట్ల రూపాయలు కూడబెట్టుకున్నారు.

ఆయనే కీసర మండల తహశీల్దార్ ఎర్వ బాలరాజు నాగరాజు. రెండు రోజుల క్రితం ఏఎస్.రావు నగర్ లో రూ.1.10 కోట్లు లంచంగా తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబట్టాడు. 1997 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రెవెన్యూ శాఖలో కంప్యూటరీకరణ ప్రారంభించారు. అయితే అప్పుడు ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన డీటీపీ ఆపరేటర్లను నియమించారు. ఆ సమయంలో కుత్బుల్లాపూర్ మండల రెవెన్యూ కార్యాలయంలో నాగరాజు కంప్యూటర్ ఆపరేటర్ గా చేరాడు.
కార్యాలయంలో చేరిన కొద్ది రోజులకే పనులు చక్కబెట్టడం, బ్రోకర్ పనిచేయడం మొదలుపెట్టాడు. పేదలకు పట్టాల పంపిణీ సమయంలో పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశాడు. అలా వచ్చిన సొమ్ముతో అధికారులను బుట్టలో వేసుకున్నాడు. మండల స్థాయి అధికారి నుంచి రాష్ట్ర స్థాయి అధికారుల వరకు మచ్చిక చేసుకుని వారికి కావాల్సింది సమకూర్చాడు. వారి అండదండలతో తన కొలువును క్రమబద్దీకరించుకుని జూనియర్ అసిస్టెంట్ గా సర్వీసు ప్రారంభించాడు.
ఇక ఆ తరువాత వెనుతిరగి చూడాల్సిన అవసరం లేకుండా పోయింది. దందా పెరగడంతో ఇద్దరు ప్రైవేటు వ్యక్తులను నియమించుకున్నాడంటే ఏ స్థాయిలో అవినీతి, అక్రమాలకు తెగబడ్డాడో అర్థమవుతుంది. 2016-17 సంవత్సరంలో కూకట్ పల్లి మండలంలో తహశీల్దార్ గా పనిచేశాడు. అక్కడి రెవెన్యూ ఇన్ స్పెక్టర్, స్థానిక బ్రోకర్లతో కలిసి కోట్లు కూడబెట్టాడు. అవినీతిపై ఫిర్యాదులు రావడంతో 2011 లో ఏసీబీ ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు చేసింది. సర్వే సెటిల్ మెంట్ రికార్డులు ఉన్నా… మళ్లీ సర్వేలు చేయించి నోటీసులు పంపిస్తామని పలువురిని బెదిరించాడు.

భూ యజమానులు భయపడి కోట్లాది రూపాయలు సమర్పించారు. ఇలా పలు ప్రభుత్వ భూములను ప్రైవేటు పరం చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. రెవెన్యూ ఇన్ స్పెక్టర్లు కూడా కోట్లాది రూపాయలు కూడబెట్టారంటే సంపాధన ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. భూ ప్రక్షాళన కోసం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తే దాన్ని కూడా అవకాశంగా మలుచుకున్నాడని అంటున్నారు. కీసర మండలంలో భూ ప్రక్షాళనలో కోట్ల రూపాయలు కూడబెట్టుకున్నారని అంటున్నారు.
కుందనపల్లిలో సర్వే నెంబర్లు 114, 132 బీ ఉన్న 19 ఎకరాల భూమిపై ఆరుగురు హక్కుదారులు ఉన్నారు. వీరి పేర్లను తొలగించగా, దీనిపై నేరేడ్ మెట్ పోలీసు స్టేషన్ కేసు నమోదు అయ్యింది. ఈ సర్వే నెంబర్ల పక్కనే ఉన్న రెండెకరాల ప్రభుత్వ భూమిని ఏపీ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం అచ్యుతాపురానికి చెందిన రాంబాబుకు కట్టబెట్టారని అంటున్నారు.

ఇదే మండలంలో ఒకరికి పాస్ పుస్తకాలు ఇచ్చినందుకు ఆయన అంకిరెడ్డిపల్లిలో ఐదెకరాల భూమి నజరానాగా ఇచ్చినట్లు సిబ్బంది చర్చించుకుంటున్నారు. ఇలా పెద్ద ఎత్తున భూములను అప్పగించి మరో ప్రాంతంలో బంధువులు, స్నేహితుల పేర్లతో తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆయన కారులో ఏసీబీ అధికారులు రూ.8 లక్షల నగదు, ఇంటి బీరువాలో రూ.28 లక్షలు నగదు, బ్యాంకు లాకర్ లో రెండుకిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఇంకా సోదాలు జరుగుతున్నాయి.

You might also like