హైదరాబాద్: రాష్ట్రంలో టీఆర్ఎస్ నాయకులు గత మూడు నాలుగు రోజులుగా ఐటీ మంత్రి కేటీఆర్ ను ఆకాశానికి ఎత్తుతున్నారు. కాబోయే సీఎం అని కొందరు, తండ్రికి తగ్గ తనయుడి అని మరికొందరు ఇలా ఎవరికివారుగా ప్రచారం చేస్తున్నారు.
తాజాగా అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ టి.పద్మారావు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ లు కేటీఆర్ సీఎం కావడంలో తప్పేమి లేదన్నారు. సికింద్రాబాద్ లో జరిగిన ఒక సమావేశంలో కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ కు శుభాకాంక్షలు అంటూ పద్మారావు పొగిడారు. రాజకీయంగా దుమారం రేపుతున్న ఈ వ్యాఖ్యలపై కేటీఆర్ ఆలోచనలో పడ్డారు. నా రాజకీయ భవిష్యత్ గురించి ఎవరూ మాట్లాడవద్దని, ఇక అలాంటి ప్రకటనలకు దూరంగా ఉండాలని ఆయన కోరారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులకు ఆయన పర్సనల్గా ఫోన్ చేసి బహిరంగ ప్రకటనలు చేయవద్దని కోరారు. ఇంకా మున్ముందు ఇంకెంత మంది చెబుతారో ఏమో చూడాలి మరి. వచ్చే నెలలో ఆయన పదవీ బాధ్యతలు చేపట్టడం ఖాయమని టీఆర్ఎస్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతున్నది.