విశాఖపట్నం: పోర్టు ఆస్పత్రి దగ్గర నిరసన వ్యక్తం చేసిన డాక్టర్ సుధాకర్ ను తాళ్లతో కట్టి పోలీసు స్టేషన్ కు తీసుకువెళ్లారు.
రోడ్డుపై నిరశన వ్యక్తం చేస్తున్న డాక్టర్ ను పోలీసులు నిలువరించారు. నిరసన కొనసాగించడంతో పోలీసులు, ఇక చేసేది లేక ఆయన మెడపై లాఠీతో వంచి, రెండు చేతులను కట్టేసి కొట్టుకుంటూ తీసుకెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. డాక్టర్ ను ఓ క్రిమినల్ మాదిరి తాళ్లతో కట్టి తరలించడంపై పలువురు విమర్శిస్తున్నారు.
నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రికి చెందిన ఎనస్థిషియా డాక్టర్‌గా సుధాకర్ విధులు నిర్వర్తించేవారు. ఆస్పత్రిలో సరైన సౌకర్యాలు లేవని, డాక్టర్లకు మాస్కులు, పీపీఈ కిట్లు లేవంటూ విమర్శించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. దీంతో ఆయనను సస్పెండ్ చేస్తూ వైద్య విధాన పరిషత్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఆయన పై నర్సీపట్నం పోలీస్‌స్టేషన్‌లో కేసులు కూడా నమోదు చేశారు. ఉద్యోగం నుంచి తొలగించినప్పటి నుంచి సుధాకర్ మానసికంగా బాధపడుతున్నారు.